బతుకు దెరువుకొచ్చి బలైపోయి..

Final Judgement Reveals Samatha Case Adilabad - Sakshi

మృగాళ్ల చేతిలో అసువులుబాసిన సమత దీనగాథ

వెంట్రుకలు, బుడగలు అమ్ముకుంటూ జీవనం

సాక్షి, ఆసిఫాబాద్‌: బతుకుదెరువు కోసం గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ వెంట్రుకలకు బుడగలు, స్టీలు సామాన్లు అమ్ముతూ జీవనం సాగించే దళిత మహిళ సమత మృగాళ్ల చేతిలో బలైపోయింది. రోజులాగే వ్యాపారం కోసం వెళ్లిన ఆమెపై మృగాళ్లు పట్టపగలే అడవిలో అత్యాచారం ఆపై హత్యకు పాల్పడ్డారు. దీంతో ఒక్క సారిగా మన్యం ఉలిక్కిపడింది. తాగిన మైకంలో బాధితురాలిపై కత్తితో దాడి చేసి చేతి వేళ్లు, కాళ్లు నరికి బలత్కారానికి పాల్పడిన తీరు కలచి వేసింది. బతుకు దెరువు కోసం వచ్చిన దళిత మహిళపై దాడి జరిగిన తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసలు వ్యక్తమయ్యాయి. గురువారం నేరస్తులకు ఉరి శిక్ష విధించడంపై స్థానికులు, దళిత, మహిళా సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. 

ఒంటరి మహిళపై అఘాయిత్యం  
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం పాత ఎల్లాపూర్‌కు చెందిన సమత తన భర్తతో కలసి ఐదేళ్ల కిత్రం కుమురం భీం జిల్లా జైనూర్‌ మండల కేంద్రంలో నివాసముంటున్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసంపల్లి వారి స్వగ్రామం. గత నవంబర్‌ 24న సమత భర్త బైక్‌పై లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో సమతను విడిచి జైనూర్‌ మండలం మోడీగూడ వెళ్లాడు. సాయంత్రం 6 గంటలు దాటినా ఆమె తిరిగి చెప్పిన చోటికి రాకపోయే సరికి రాత్రి 8 గంటలకు జైనూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మొదట మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఆ మర్నాడు ఎల్లాపటార్‌ నుంచి రాంనాయక్‌ తండాకు వెళ్లే దారి మధ్యలో విగత జీవిగా పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత 27న ఎల్లాపటార్‌కు చెందిన షేక్‌ బాబు, షేక్‌ షాబొద్దీన్, షేక్‌ మఖ్దుంలను అరెస్టు చేసి లోతుగా విచారణ చేపట్టారు.

మృగాళ్ల దాష్టీకం..
వస్తువులు విక్రయిస్తూ ఎల్లాపటార్‌ నుంచి రాంనాయక్‌తండాకు నడుచుకుంటూ వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న ఎల్లాపటార్‌కు చెందిన షేక్‌బాబు, షేక్‌ షాబొద్దీన్, షేక్‌ మఖ్దుంలు ఆమెను అడ్డగించారు. రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి బలవంతంగా లాక్కెలారు. మొదట షేక్‌ బాబు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టగా, మిగతా ఇద్దరు ఆమె కాళ్లు, చేతులు గట్టిగా అదిమి పట్టుకున్నారు. ఆ తర్వాత వారూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించగా కాళ్లు, చేతులు, తలపై తీవ్రంగా గాయపర్చారు. ఆమె నెలసరి సమయంలోనే మృగాళ్లు ఈ ఘాతు కానికి పాల్పడినట్లు అక్కడి ఆధారాలను బట్టి తేలింది.

దిశ ఎన్‌కౌంటర్‌తో పెరిగిన ఒత్తిడి..
వాస్తవానికి సమత ఘటన.. దిశ ఘటన కంటే 3 రోజుల ముందే జరిగింది. దిశ ఘటనలో పౌర సమాజం పెద్ద ఎత్తున స్పందించడం, ఆ తర్వాత నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్‌లో మరణించడంతో సమతకు సమన్యాయం చేయాలని నిరసనలు వచ్చాయి. పలువురు నేతలు ఆదిలాబాద్‌ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది.

సమత భర్తకు ఉద్యోగం
అట్రాసిటీ కేసులో బాధితులుకు ఇచ్చే పరిహారం కింద సమత భర్తకు ఘటన జరిగిన పక్షం రోజుల్లోనే ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో అటెండర్‌ ఉద్యోగం ఇస్తూ కుమ్రంభీం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికసాయం అందజేసి, మృతురాలి ఇద్దరు కుమారులను స్థానిక ప్రభుత్వ గురుకులాల్లో చేర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top