ఓడిన సర్పంచ్‌లు, సర్పంచ్‌ల భర్తలు

Few Candidates Won And Lost In Municipal Elections - Sakshi

సాక్షి, చౌటుప్పల్‌ : మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు సైతం ఓటమి పాలయ్యారు. నామమాత్రపు రాజకీయ అనుభవం ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు.  మున్సిపాలిటీ ఏర్పాటుకు ముందు చౌటుప్పల్, తంగడపల్లి, లింగోజిగూడెం, లక్కారం, గ్రామాలకు సర్పంచ్‌లుగా, సర్పంచ్‌ల భర్తలుగా రాజకీయ తిప్పిన వ్యక్తులు సైతం ఓడిపోవాల్సి వచ్చింది.

చౌటుప్పల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పని చేసిన బొంగు లావణ్య భర్త మాజీ వైస్‌ ఎంపీపీ బొంగు జంగయ్య(టీఆర్‌ఎస్‌) 19వ వార్డు నుంచి, లింగోజిగూడెం  తాజా మాజీ సర్పంచ్‌ రమనగోని దీపిక భర్త అదే గ్రామ మాజీ సర్పంచ్‌ రమనగోని శంకర్‌(బీజేపీ), తంగడపల్లి తాజా మాజీ సర్పంచ్‌ ముటుకుల్లోజు దయాకరాచారి(టీఆర్‌ఎస్‌), లక్కారం తాజా మాజీ సర్పంచ్‌ కానుగు యాదమ్మ భర్త కానుగు బాలరాజు(టీఆర్‌ఎస్‌), లింగోజిగూడెం మాజీ సర్పంచ్‌ ఊదరి నర్సింహ్మ(టీఆర్‌ఎస్‌) పరాజయం పాలయ్యారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాకుండా ఎంతో కాలంగా వీరు గెలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ అనూహ్య పరిణామాల కారణంగా ఓడిపోయారు. విశేష రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఓటరు తీర్పును అంగీకరించాల్సి వచ్చింది.

మోత్కూరు:  మోత్కూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయి బొల్లెపల్లి వెంకటయ్య నూతనంగా ఏర్పడిన మోత్కూరు మున్సిపాలిటీలో అదే పార్టీనుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన గెలుపొందాడు. 8వ వార్డునుంచి అవిశెట్టి అవిలిమల్లు (కాంగ్రెస్‌)పై వెంకటయ్య 39 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి సానుభూతి ఆయనకు కలిసొచ్చిందంటున్నారు. 

నాడు ఎంపీటీసీగా ఓడి..
మండల పరిషత్‌ ఎన్నికల్లో మోత్కూరు –2 ఎంపీటీసీ సభ్యుడిగా పోటీ చేసిన గుర్రం కవిత ఓటమి పాలయ్యారు. ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో 11వ వార్డు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పసల విజ యపై 19 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ కవితను ప్రకటించగా ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ అధిక స్థానాలు గెలువడంతో కవిత కౌన్సిలర్‌గా గెలిచినా ఫలితం లేకుండా పోయింది.

నాడు వార్డు మెంబర్‌గా.. నేడు కౌన్సిలర్‌గా విజయం 
మోత్కూరు గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించి నేడు మున్సిపల్‌ ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్‌గా కారుపోతుల శిరీష (కాంగ్రెస్‌) గెలుపొందారు. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా విజయం సాధించడంతో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది.

అన్న గెలుపు.. తమ్ముళ్ల ఓటమి
చౌటుప్పల్‌ :  చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కౌన్సిలర్లుగా పోటీ చేశారు. వారిలో ఇద్దరు ఓటమి పాలవ్వగా ఒకరు విజయం సాధించారు. పట్టణ కేంద్రానికి చెందిన సీపీఎం పట్టణ మాజీ కార్యదర్శి బత్తుల శ్రీశైలం అదే పార్టీ నుంచి 19వ వార్డులో పోటీ చేశాడు. తన బాబాయి కుమారులైన బత్తుల వెంకటేశం బీజేపీ తరఫున 20వవార్డు, విప్లవ్‌కుమార్‌ 16వ వార్డులో సీపీఎం తరుఫున పోటీ చేశారు. కానీ శ్రీశైలం 19వవార్డులో బీజేపీపై విజయం సాధించగా,  వెంకటేశం, విప్లవ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు.   

చండూరు: చండూరు మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మాజీ ఎంపీపీ తొకల వెంకన్నతో పాటు అతని భార్య చంద్రకళ కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచారు. వెంకన్న 8వ వార్డు నుంచి బరిలో నిలవగా అయనపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూతరాజు దశరథ పోటీ చేశారు. దశరథపై తోకల వెంకన్న 49 ఓట్ల తేడాతో గెలుపొందాడు. అలాగే అతని భార్య చంద్రకళ 10వ వార్డు నుంచి బరిలో నిలువగా ఆమెపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేలుకుంట్ల రాజకుమారి పోటీ చేసింది. రాజకుమారిపై చంద్రకళ 240 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. 

ఓడిన దంపతులు
1వ వార్డునుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున కోడి గిరిబాబు బరిలో నిలిచాడు. టీఆర్‌ఎస్‌నుంచి పోటీ చేసిన తన సోదరుడు కోడి వెంకన్నపై గిరిబాబు 223 ఓట్లతో ఓటమిపాలయ్యాడు. అదే విధంగా తన భార్యను చైర్మన్‌ చేయాలని కోడి గిరిబాబు 7వ వార్డునుంచి భార్య విజయలక్షి్మని కాంగ్రెస్‌ తరఫున పోటీలో నిలిపాడు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిలుకూరి రాధికపై విజయలక్ష్మి 148 ఓట్లతో పరాజయం పాలైంది.

ఓడిన తాజా మాజీ కౌన్సిలర్లు, చైర్మన్లు
భువనగిరి : గత మున్సిపాలిటీ కాలంలో కౌన్సిలర్లుగా పనిచేసి తిరిగి ఈ నెల 22న జరిగిన ఎన్నికల బరిలో నిలిచి కొందరు ఓటమి పాలయ్యారు. ఇందులో  6వ వార్డు నుంచి కుక్కదూవు లతశ్రీ, 10వ వార్డు నుంచి బట్టుపల్లి అనురాధ, ఇదే వార్డు నుంచి పడమటి జగన్‌మోహన్‌రెడ్డి,  20వ వార్డు నుంచి చిట్టిప్రోలు సువర్ణ, 21వ వార్డు నుంచి ఫతే మహ్మద్, 30వ వార్డు నుంచి లయిఖ్‌ అహ్మద్, ఇదే వార్డు నుంచి షఫిక్‌ అహ్మద్‌  ఉన్నారు.

ఓడిన మాజీ చైర్మన్లు
వివిధ  పాలకవర్గాల్లో చైర్మన్లుగా ఎన్నికై ప్రస్తుతం కౌన్సిర్లుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇందులో 35వ వార్డు నుంచి నువ్వుల ప్రసన్న, 8వ వార్డునుంచి  బర్రె జహంగీర్, 25వ వార్డునుంచి  కొల్పుల కమలాకర్, 28వ వార్డు నుంచి సుర్వి లావణ్య, 9వ వార్డు నుంచి దోనకొండ వనిత ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top