డాక్టర్‌ను నిర్బంధించిన ఆస్పత్రి యాజమాన్యం

Fever Hospital DMO Detained At Chaderghat Thumbay Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌​: చాదర్‌ఘాట్‌లోని తుంబే ఆస్పత్రి యాజమాన్యం కరోనా భయాలను సొమ్ము చేసుకుంటున్న వైనం ఆదివారం బయటపడింది. సాధారణ ప్రజలతోపాటు కరోనా వారియర్స్‌కూ ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులతో చుక్కలు చూపెడుతున్నాయి. తాజాగా అధిక బిల్లులపై ప్రశ్నించిన ఫీవర్‌ ఆస్పత్రి డీఎంవో డాక్టర్‌ సుల్తానాను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనా లక్షణాలతో తుంబే ఆస్పత్రిలో చేరిన తనకు 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని ఆమె సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా క్లిష్ట సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్‌గా సేవలందించిన తన పట్ల తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సుల్తానా ఆరోపించారు. 

బిల్లులపై ప్రశ్నించినందుకు సరైన వైద్య సేవలందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుల్తానా కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరితే లక్షకు పైగా బిల్లు వేశారని విమర్శించారు. సుల్తానాను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, తుంబే ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని కోరారు.
(చదవండి: అమ్మను పిలుస్తున్న లేసిరా కొడుకా..)

అన్నీ వేస్తే తడిసి మోపెడు
కరోనా బాధితులకు చికిత్స విషయంలో ప్రభుత్వ నిబంధనలను ప్రైవేటు ఆస్పత్రులు బేఖాతరు చేస్తున్నాయి. జనరల్‌ వార్డుల్లో కరోనా చికిత్సను అనుసరించి ఫీజులు వసూలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలివ్వగా.. ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి రంగం సిద్ధం చేశాయి. జనరల్‌ వార్డులనే ప్రత్యేక వార్డులుగా మార్చి ఫీజుల బాదుడు మొదలుపెట్టాయి. శానిటైజేషన్‌, వైద్య సిబ్బంది పీపీఈ కిట్ల వ్యయాన్ని కూడా పేషంట్లపైనే వేయడంతో బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. 

(చదవండి: కరోనా భయంతో సాగర్‌లో దూకాడు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top