ఫాస్ట్‌ ట్యాగ్‌ !

fast tag technology lounh in mahabubnagar district - Sakshi

సాంకేతిక పరిజ్ఞానంలో ఆర్టీసీ ముందడుగు

టోల్‌ప్లాజాల వద్ద సమయం ఆదా

పది అడుగుల దూరం నుంచే స్కాన్‌ చేస్తున్న మిషన్లు

ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్‌  రీజియన్‌లో అమలు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకోవడంలో ఆర్టీసీ అధికారులు ఓ అడుగు ముందుకేశారు. టోల్‌గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్‌ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ స్టికర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తద్వారా టోల్‌గేట్ల వద్ద నిరీక్షించకుండా ఫాస్ట్‌ట్యాగ్‌ స్టికర్లపై ఉండే బార్‌కోడింగ్‌ సాయంతో నేరుగా బస్సులు వెళ్లిపోనున్నాయి. ఈ మేరకు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు, మిషన్లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్‌ రీజియన్‌లో టోల్‌ప్లాజ్‌ల మీదుగా హైదరాబాద్, కర్నూలు తిరిగే బస్సులకు ‘ఫాస్ట్‌ ట్యాగ్‌’ పద్ధతిని ఆర్టీసీ అమలు చేస్తోంది.

మూడు టోల్‌ ప్లాజాలు
మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలో ఇటు హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ‘ఫాస్ట్‌ ట్యాగ్‌’ అమలు చేస్తున్నా రు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు 200 కి.మీ మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై మూడు టోల్‌ ప్లాజాలు ఉన్నాయి. వీటి వద్ద ఆర్టీసీ బస్సులు టోల్‌ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్‌ చూపించేందుకు వేచిచూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్‌ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్‌ట్యాగ్‌ స్టికర్‌ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్‌ కోడ్‌ ఉంటుంది. రీజియన్‌ పరిధిలోని రాయికల్, అడ్డాకుల, ఎర్రవల్లి టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్‌ట్యాగ్‌ బస్సులు చేరుకోగానే ఎక్కువ సమయం వేచి ఉండకుండా పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్‌ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్‌ తెరుచుకుంటుంది. టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్‌ కూడా ఏర్పాటు చేశారు.

రీజియన్‌లోనే ప్రథమంగా...
ఫాస్ట్‌ట్యాగ్‌ విధానాన్ని మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ రీజియన్‌లో ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా ప్ర వేశపెట్టారు. ఈ ప్రయోగం విజయ వంతం కావడంతో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి పూరిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్‌ స్టిక్కర్లు వేశారు.అమర్చారు. హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులకు సమయం ఆదా అవుతున్నప్పటికీ రాయికల్‌ టోల్‌ప్లాజ్‌లో ఒకే కౌంటర్‌ ఉండడంతో కొన్నిసార్లు బస్సుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. టోల్‌ప్లాజ్‌లోని అన్ని కౌంటర్లలో ఫాస్ట్‌ట్యాగ్‌ ఉన్న బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా
టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్‌ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోంది. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్‌ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఫాస్ట్‌ట్యాగ్‌ వల్ల ఆ ఆలస్యాన్ని నివారించగలుగుతున్నాం. – మహేశ్, ఆర్టీసీ డీవీఎం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top