యాసంగి పంటలకు ఎస్సారెస్పీ నీళ్లు

Farmers Problems SRSP Water Release Karimnagar - Sakshi

వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్న తరుణంలో యాంసంగి పంటకు సాగునీటిని అందించాలని సర్కారు నిర్ణయించింది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని బలోపేతం చేసేందుకు ఏటా రెండు పంటలకు సాగు నీటిని అందించే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు ఎస్సారెస్పీ పరిధిలో సాగులో ఉన్న ఆయకట్టు ప్రాంత ఎమ్మెల్యేలతో బుధవారం నీటిపారుదల శాఖ అధికారులు హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశం నిర్వహించారు. రబీసాగుకు నీటి విడుదల, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పనుల పురోగతిపై చర్చించారు.   – సాక్షిప్రతినిధి, కరీంనగర్,     

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఎస్సారెస్పీపై హైదరాబాద్‌లో నిర్వహిం చిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో ఉన్న నీటి నిల్వలు, కాల్వల ద్వారా అందించేందుకు నీటి లభ్యత, సాగు విస్తీర్ణం పెంచేందుకు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు పనుల పురోగతి, ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి నిధుల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరిగింది. ముఖ్య మంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ పనులు జూన్‌ 30వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించారు. నిధులు వంద శాతం ఖర్చుచేయడంతో పాటు పనుల పురోగతి చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రాజెక్టు పునరుజ్జీవ పనులు వేగవంతంగా చేపట్టడంతో పాటు రబీలో చెరువులు, కుంటలు అధికారికంగా నింపి ఒక్క ఎకరం నేల కూడా ఎండిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు.

14.40 లక్షల ఎకరాలకు నీరు..
గత ప్రభుత్వాలు ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లు ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎస్సారెస్పీ ద్వారా 14.4 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఎత్తయిన ప్రాంతాలకు లిఫ్టుద్వారా సాగునీటిని అందించే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొత్త ఆయకట్టుతో పాటు ఎస్సారెస్పీ సామర్థ్యం పెంపు కోసం ప్రాజెక్టు ఆ«ధునికీకరణకు కూడా నిధులు కేటాయించి సాగు విస్తీర్ణం పెంచుతున్నామన్నారు.

ప్రాజెక్టు సామర్థ్యం పెంపుతో పాటు ఎస్సారెస్పీ కాలువల సామర్థ్యాన్ని 3000 క్యూసెక్కుల నుంచి 6000 క్యూసెక్కులకు పెంచడం జరిగిందని వెల్లడించారు. పునరుజ్జీవ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జూన్‌ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేస్తే వర్షాకాలంలో ప్రాజెక్టు నీటితో కలకలాడే అవకాశం ఉందన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు టార్గెట్‌ పెట్టుకొని పనుల్లో వేగం పెంచి గడువులోపు పూర్తిచేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఎండాకాలంలోపు గౌరవెల్లి వరకు...
మిడ్‌ మానేరు నుంచి గౌరవెళ్లి వరకు జరుగుతున్న పనులు ఎండాకాలం లోపే పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని ఎమ్మెల్యేలు ఇరిగేషన్‌ అధికారులను కోరారు. కాలువల తవ్వకం కోసం భూసేకరణతో పాటు ఉన్న ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గోదావరినదిపై చేపట్టిన కాళేశ్వరం రివర్స్‌ పంపింగ్‌ నీళ్లు వర్షాకాలం వరకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నీళ్లు అందితే ఇక తెలంగాణలో నీటి కొరత అనేదే ఉండదని తెలిపారు. పోచంపాడ్‌ నుంచి ఖమ్మం వరకు 14.40 లక్షలతో పాటు ఎత్తైన ప్రాంతాలకు లిఫ్ట్‌ల ద్వారా నీరు అందిస్తామని వెల్లడించారు. జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సమావేశంలో చర్చించారు.

10 నుంచి ఎల్‌ఎండీ నీటి విడుదల

కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) కింద సాగయ్యే ఆయకట్టు పంటలకు ఫిబ్రవరి 10 నుంచి ఒక తడి నీరు విడుదల చేస్తామని మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అధికారులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 5లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎస్సారెస్పీ ద్వారా 14లక్షల 40 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని, రబీ పంటకు కూడా అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే తవ్విన కాల్వలకు 3వేల క్యూసెక్కుల కెపాసిటీ నుంచి 6వేల క్యూసెక్కుల నీరు వదిలి పరీక్షించడం జరిగిందన్నారు.

డిస్ట్రిబ్యూషన్‌ కెనాల్స్‌ను బలోపేతం చేసుకోవాల్సి ఉందన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారికంగా చెరువులు, కుంటలు నింపాలన్నారు. తద్వారా భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు. జూన్‌ 30 వరకు కేటాయించిన నిధులు 100 శాతం ఖర్చు చేయాలని, అవసరం అయితే మరిన్ని నిధులు తెచ్చుకుంటామన్నారు. కొన్ని చోట్ల భూ సేకరణలో సమస్యలు ఉన్నాయని, వాటిపైన పూర్తి దృష్టి సారిస్తామన్నారు.

వర్షాకాలనికి గౌరవెళ్లి వరకు నీళ్లు తీసుకెళ్తామని తెలిపారు. పనులు ఎక్కడా ఆగలేదని, వేగంగా జరిగేలా ప్రజాప్రతినిధులం కృషి చేస్తున్నామని అన్నారు. కాళేశ్వరం నీళ్లు వీటికి అనుసంధానం కాబోతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఈఎన్‌సీ మురళీధర్‌ నేతృత్వంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు  ఎర్రబెల్లి దయాకర్, సోలిపేట రామలింగారెడ్డి, రసమయి బాలకిషన్, వి.సతీష్‌బాబు, సుంకే రవిశంకర్, నన్నపనేని నరేందర్, సీతక్క, ఆరూరి రమేష్, ఇరిగేషన్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి హాజరయ్యారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top