పతాకావిష్కరణ బదులు ఆయన ఏం చేశారంటే.. | farest officer drink alcohol on independence day | Sakshi
Sakshi News home page

పతాకావిష్కరణ బదులు ఆయన ఏం చేశారంటే..

Aug 15 2017 8:15 PM | Updated on Sep 12 2017 12:09 AM

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా.. ఓ అటవీశాఖ రేంజర్‌ మాత్రం మద్యం తాగుతూ కూర్చున్నాడు.

భద్రాద్రికొత్తగూడెం: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా.. ఓ అటవీశాఖ రేంజర్‌ మాత్రం మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఆ మత్తులో కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తూ.. ఆవిష్కరణకు సిద్ధం చేసిన జెండాకర్రను ఓ మూలన పెట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో జరిగింది. అచ్యుతాపురం క్రాస్‌ రోడ్‌లోని ఫారెస్ట్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో రేంజర్‌గా పని చేస్తున్న సదానందాచారి ఉదయం జెండావిష్కరణ సమయంలతో మద్యం మత్తులోనే కార్యాలయానికి వచ్చాడు. స్వాతంత్ర్య వేడుకల కోసం అప్పటికే సిబ్బంది జాతీయ జెండా, మహాత్మాగాంధీ చిత్రపటం, కొబ్బరికాయలు, మిఠాయిలు, బిస్కెట్లు సిద్ధం చేశారు.

జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్‌.. తాపీగా సిగరెట్‌ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్‌.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’ అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్‌షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. ఇది గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్‌ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్‌ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్‌ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు.

ఈ ఘటనపై రేంజర్‌ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్‌ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మర్చిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement