breaking news
farest officer
-
నర్సరీల బాధ్యత సర్పంచ్లదే
ధారూరు: ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ వన నర్సరీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం తగిన స్థలాలను గుర్తించాలని ధారూరు ఫారెస్టు రేంజర్ సీహెచ్ వెంకటయ్యగౌడ్ సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం ధారూరు మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్ చైర్మెన్, కోఆప్షన్ సభ్యుడు, ఐకేపీ గ్రామ సంఘం లీడర్, మండల, గ్రామ స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఏపీఎం, ఏపీఓ, టీఏలు, ఎఫ్ఏలు, ఈసీ, సీసీలకు జరిగిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. గ్రామ వన నర్సరీల ఏర్పాటు కోసం పాఠశాలల్లోని ఖాళీ స్థలాలను, బంజరు, బీడు భూములు, గ్రామ కంఠాల స్థలాలను ఎంపిక చేస్తే అనువుగా ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి గ్రామ వన నర్సరీలో 40 వేల వివిధ రకాల మొక్కలను పెంచాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వన నర్సరీలకు నీటి వసతి, నిర్వాహణ బాధ్యతలు సర్పంచులే చూడాల్సి ఉంటుందన్నారు. పనులు చేసే కూలీలకు మాత్రం ఉపాధిహామీ పథకం ద్వారా డబ్బులు అందుతాయని చెప్పారు. గ్రామ వన నర్సరీల్లో పెంచే ప్రతి మొక్క గ్రామస్తులకు అవసరమైనవిగా ఉండాలని, అలాంటి మొక్కలనే ఎంపిక చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొక్కలను పెంచడానికి పాలిథిన్ కవర్లు, సారవంతమైన మట్టి, నీటి వాడకంపై ఆయన సమగ్రంగా వివరించారు. అనంతరం జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు మాట్లాడుతూ అభివృద్ధి అంటే గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలే కాదని మొక్కల పెంపకం కూడ ఇందులో భాగమే అన్నారు. చెట్లు ఏపుగా పెరిగితే గ్రామం పచ్చదనంతో అందంగా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం నివారింపబడుతుందన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం కనీసం 5 మొక్కల వరకు నాటాలని, పొలాల వద్ద ఎకరాకు 40 మొక్కల చొప్పున నాటవచ్చని ఆయన సూచిం చారు. ఫారెస్టు వారు మొక్కలను పెంచి పంపిణీ చేస్తే వాటిని తీసుకెళ్లి నాటకుండా వృథాగా పడేయరాదని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సబిత, ఈఓపీఆర్డీ మున్నయ్య, ఏఓ పావని, ఏపీఓ సురేశ్, ఏపీఎం దేవయ్య, గ్రామ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
పతాకావిష్కరణ బదులు ఆయన ఏం చేశారంటే..
భద్రాద్రికొత్తగూడెం: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా.. ఓ అటవీశాఖ రేంజర్ మాత్రం మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఆ మత్తులో కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తూ.. ఆవిష్కరణకు సిద్ధం చేసిన జెండాకర్రను ఓ మూలన పెట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో జరిగింది. అచ్యుతాపురం క్రాస్ రోడ్లోని ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో రేంజర్గా పని చేస్తున్న సదానందాచారి ఉదయం జెండావిష్కరణ సమయంలతో మద్యం మత్తులోనే కార్యాలయానికి వచ్చాడు. స్వాతంత్ర్య వేడుకల కోసం అప్పటికే సిబ్బంది జాతీయ జెండా, మహాత్మాగాంధీ చిత్రపటం, కొబ్బరికాయలు, మిఠాయిలు, బిస్కెట్లు సిద్ధం చేశారు. జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్.. తాపీగా సిగరెట్ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’ అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. ఇది గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు. ఈ ఘటనపై రేంజర్ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మర్చిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.