నర్సరీల బాధ్యత సర్పంచ్‌లదే

Sarpanches Are The Responsibility Of Nurseries - Sakshi

అనువైన స్థలాలను సర్పంచులు గుర్తించాలి

అవగాహన సమావేశంలో ధారూరు ఫారెస్టు రేంజర్‌ వెంకటయ్యగౌడ్‌

ధారూరు: ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ వన నర్సరీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం తగిన స్థలాలను గుర్తించాలని ధారూరు ఫారెస్టు రేంజర్‌ సీహెచ్‌ వెంకటయ్యగౌడ్‌ సూచించారు. హరితహారంలో భాగంగా గురువారం ధారూరు మండల పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్‌ చైర్మెన్, కోఆప్షన్‌ సభ్యుడు, ఐకేపీ గ్రామ సంఘం లీడర్, మండల, గ్రామ స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, ఏపీఎం, ఏపీఓ, టీఏలు, ఎఫ్‌ఏలు, ఈసీ, సీసీలకు జరిగిన అవగాహన, శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

గ్రామ వన నర్సరీల ఏర్పాటు కోసం పాఠశాలల్లోని ఖాళీ స్థలాలను, బంజరు, బీడు భూములు, గ్రామ కంఠాల స్థలాలను ఎంపిక చేస్తే అనువుగా ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి గ్రామ వన నర్సరీలో 40 వేల వివిధ రకాల మొక్కలను పెంచాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ వన నర్సరీలకు నీటి వసతి, నిర్వాహణ బాధ్యతలు సర్పంచులే చూడాల్సి ఉంటుందన్నారు.

పనులు చేసే కూలీలకు మాత్రం ఉపాధిహామీ పథకం ద్వారా డబ్బులు అందుతాయని చెప్పారు. గ్రామ వన నర్సరీల్లో పెంచే ప్రతి మొక్క గ్రామస్తులకు అవసరమైనవిగా ఉండాలని, అలాంటి మొక్కలనే ఎంపిక చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొక్కలను పెంచడానికి పాలిథిన్‌ కవర్లు, సారవంతమైన మట్టి, నీటి వాడకంపై ఆయన సమగ్రంగా వివరించారు.

అనంతరం జెడ్పీటీసీ పట్లోళ్ల రాములు మాట్లాడుతూ అభివృద్ధి అంటే గ్రామంలో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలే కాదని మొక్కల పెంపకం కూడ ఇందులో భాగమే అన్నారు. చెట్లు ఏపుగా పెరిగితే గ్రామం పచ్చదనంతో అందంగా ఉంటుందని, పర్యావరణ కాలుష్యం నివారింపబడుతుందన్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం కనీసం 5 మొక్కల వరకు నాటాలని, పొలాల వద్ద ఎకరాకు 40 మొక్కల చొప్పున నాటవచ్చని ఆయన సూచిం చారు.

ఫారెస్టు వారు మొక్కలను పెంచి పంపిణీ చేస్తే వాటిని తీసుకెళ్లి నాటకుండా వృథాగా పడేయరాదని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సబిత, ఈఓపీఆర్డీ మున్నయ్య, ఏఓ పావని, ఏపీఓ సురేశ్, ఏపీఎం దేవయ్య, గ్రామ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top