ఖమ్మం డీసీసీబీ ‘ఉత్తుత్తి బ్యాంక్‌’! 

Fake bank at khammam - Sakshi

     సొంత బ్యాంకు బ్రాంచి పెట్టుకుని వసూళ్లు 

     ఆర్బీఐ అనుమతి లేదు.. టెస్కాబ్‌కు సమాచారం లేదు

     ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్న వైనం 

     టెస్కాబ్‌ విచారణలో వెల్లడైన నిజాలు

సాక్షి, హైదరాబాద్‌: దశాబ్దం క్రితం తెలుగులో ఓ సినిమా వచ్చింది. అందులో ‘ఉత్తుత్తి బ్యాంకు’ అని ఓ బ్యాంకు ఏర్పాటు చేస్తారు. అప్పటికప్పుడు ఓ సెటప్‌ చేసి డబ్బు వసూళ్లు సాగిస్తారు. సరిగ్గా అదే తీరులో ఖమ్మం పూర్వ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక వర్గం కూడా దర్జాగా ఒక సహకార బ్యాంకు బ్రాంచిని తెరిచి రైతుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేసింది. దానికి రిజర్వు బ్యాంకు అనుమతి లేదు సరికదా కనీసం తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (టెస్కాబ్‌)కు సమాచారం కూడా లేదు. టెస్కాబ్‌ జరిపిన విచారణలో ఈ విషయం బయటపడినట్లు సహకార శాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు రైతుల నుంచి దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి నిర్మాణం
రైతులకు రుణాలు, బ్యాంకు లావాదేవీలు జరపాల్సిన డీసీసీబీ.. ఒక ట్రస్టు ఏర్పాటు చేసి ఆసుపత్రి నిర్మించడం రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధం. ఖమ్మం డీసీసీబీ రైతు సంక్షేమ నిధి పేరుతో రైతులకిచ్చే పంట రుణాల నుంచి వసూళ్లకు పాల్పడిందని గతంలో జరిపిన విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. అలా రూ.8.11 కోట్లు వసూలు చేసి ఆసుపత్రి నిర్మించింది. అంతేగాక రైతు సంక్షేమ నిధి పేరిట పెద్ద ఎత్తున నిధులను ఆసుపత్రికి వెచ్చిస్తూ, వాహనాల కొనుగోళ్లకు భారీగా ఖర్చు చేస్తున్నారని కూడా ఆరోపణలున్నాయి. వసూలు చేసిన సొమ్మును రైతుల సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు పాలకవర్గం ఇచ్చిన వివరణ రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధమని టెస్కాబ్‌ ఇప్పటికే స్పష్టంచేసింది. వచ్చే నెలాఖరుకు పాలకవర్గ కాలపరిమితి ముగియనుంది. ఆరోపణలు నిజమేనని తేలాక కూడా ప్రభుత్వం మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top