'దృష్టి'కి దిష్టి తగిలింది!

Eye problems for 40% people in the state - Sakshi

రాష్ట్రంలో 40% మందికి కంటి సమస్యలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’కార్యక్రమంలో లక్షలాది మంది వివిధ రకాల కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. కంటి వెలుగుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సర్కారుకు పంపిన నివేదికలో అనేక అంశాలను వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం... ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో అధికంగా 40 శాతం మంది కంటి సమస్యలతో బాధపడుతుండటంపై వైద్య నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఇంతమందికి కంటి సమస్యలు ఉండటానికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు, పేదరికం కారణంగా ఇప్పటివరకు పట్టించుకోకపోవడం వంటివేనని స్పష్టం చేస్తున్నారు.      

ఆడవారిలో అధిక సమస్యలు...  
కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటివరకు 77.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అందులో అత్యధికంగా 42.84 లక్షల (55.23%) మహిళలే ఉన్నారు. 34.72 లక్షల (44.76%) మంది పురుషులున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బీసీలు 56.48% ఉన్నారు. ఎస్సీలు 17.15%, ఎస్టీలు 10.51 శాతమున్నారు. ఓసీలు 10.59% మంది ఉన్నారు. మైనారిటీలు 5.27 శాతం ఉన్నారు.  

13.92 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు..
కంటి వెలుగులో దీర్ఘ దృష్టి ఉన్న వారికి రీడింగ్‌ గ్లాసులు అందజేశారు. అందులో 40 ఏళ్లలోపు వారు 2.45 లక్షల మంది ఉంటే, 40 ఏళ్లు పైబడినవారు 11.46 లక్షల మంది ఉన్నారు. ఇక హస్వ దృష్టితో బాధపడుతున్నవారికి ప్రత్యేక అద్దాలు కావాలని వైద్యులు ప్రిస్కిప్షన్‌ రాసిచ్చారు. వారందరికీ కంపెనీ నుంచి ప్రత్యేకంగా కంటి అద్దాలు సరఫరా చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 వేల మందికే అందజేశారు. ఇంకా 11 లక్షల మందికి చత్వారం కంటి అద్దాలు సకాలంలో సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా కంటి పరీక్షలు చేశాక కేవలం 3 లక్షల మందికి మాత్రమే ఆపరేషన్లు అవసరమని వైద్యాధికారులు ముందుగా అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు చేసిన పరీక్షల్లోనే ఏకంగా 5.78 లక్షల మందికి కంటి ఆపరేషన్లు అవసరమని నిర్దారణకు రావడం గమనార్హం. మిగిలిన ప్రజలందరికీ కంటి పరీక్షలు చేసే సరికి ఆ సంఖ్య 12 లక్షలకు పైగానే చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఆపరేషన్లు అవసరమైనా చేయించుకోకుండా అలాగే ఉండటం వల్ల ఈ సంఖ్య అధికంగా కనిపిస్తుందని అంటున్నారు.  

చైతన్యం లేకపోవడంతోనే..
ప్రజల్లో చైతన్యం లేక కంటి సమస్యలు అధికంగా నమోదవుతున్నాయి. ఆహారపు అలవాట్లు సరిగా లేక, షుగర్‌ వ్యాధి ఉన్నా గుర్తించక త్వరగానే కంటి సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కంటి సమస్యను పెద్దగా పట్టించుకోవడంలేదు. ముదిరే వరకు చూస్తూనే ఉన్నారు. పేదరికం, చైతన్యం లేకపోవడంతో ఇలా జరుగుతోంది. స్టెరాయిడ్స్‌ మందులు వాడటం, షుగర్‌ తదితర కారణాలతో క్యాటరాక్ట్‌ వస్తుంది. ముదిరే వరకు చూస్తే మున్ముందు కనుచూపు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి కంటి సమస్యలను గుర్తించి వైద్యులను సంప్రదించాలి.  
– డాక్టర్‌ దీప శిల్పిక, సన్‌షైన్‌ ఆసుపత్రి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top