కోవిడ్‌ బాధితుడి కుటుంబ సభ్యులు సేఫ్‌

Etela Rajender Says No COVID-19 Positive Cases In Telangana - Sakshi

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల వెల్లడి

రెండు కేసుల శాంపిళ్లను పుణేకు పంపామని స్పష్టీకరణ  

సాక్షి, హైదరాబాద్‌: ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తితో పాటు, కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తికి చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి శానిటేషన్‌ వర్కర్‌ నమూనాలను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి తిరిగి బుధవారం పంపించామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం సాయంత్రానికి రిపోర్టులు వచ్చే అవకాశముందన్నారు. గాంధీ ఆస్పత్రిలో 47 మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించామని, అందులో 45 మందికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని తెలిపారు. వారందరినీ ఇంటికి పంపామన్నారు. ఇద్దరి నివేదికల్లో స్పష్టత కోసం పుణే ల్యాబ్‌కు పంపామని చెప్పారు. కోవిడ్‌ వివరాలను కేంద్రం పూర్తిస్థాయిలో నిర్ధారించాకే ప్రకటిస్తుందన్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తితో పాటు ప్రయాణించిన వ్యక్తులు, కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించామన్నారు.

కోవిడ్‌ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులకు నెగెటివ్‌ రిపోర్టు వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని ఏ వ్యక్తికీ కోవిడ్‌ సోకలేదని, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారికే వచ్చిందని స్పష్టం చేశారు. వదంతులు, అవాస్తవాలు ప్రచారం చేస్తే ప్రజలు భయాందోళనలకు గురవుతారని పేర్కొన్నారు. అనుభవం లేని, అవగాహనలేని కొందరు సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి ఇంటి చుట్టుపక్కల నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్రాన్ని 50 వేల మాస్కులు పంపాలని అడిగినట్లు తెలిపారు. సామాజిక బాధ్యతతో కోవిడ్‌ బాధితులకు ఉచితంగా చికిత్స అందించేందుకు ముందుకు వచ్చిన ప్రైవేటు మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలకు మంత్రి కృతజ్ఞతలు వెల్లడించారు. పూర్తి స్థాయిలో కోవిడ్‌ పర్యవేక్షణ కంట్రోల్‌ రూమ్‌లో ఉండి పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ కూడా కోవిడ్‌ పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top