ఈఎస్‌ఐ స్కాంలో మరో కీలక మలుపు

ESI Medical Scam Section Officer Order To Doctors For Fake Bills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ మందుల కుంభకోణానికి సంబంధించిన అక్రమాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి మరో సంచలన విషయం శనివారం బయటపడింది. డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్‌ ఆఫీసర్‌ సురేంద్ర నాథ్‌ బెదిరించిన ఆడియో టేపులు బయటకి రావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసుల విచారణంలో ఈ ఆడియో టేపులు బయటకి వచ్చినట్టు సమచారం. వీటి ఆధారంగా కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.  

ప్రస్తుతం సురేంద్ర నాథ్‌, డాక్టర్‌ మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈఎస్‌ఐ డాక్టర్లను తప్పుడు బిల్లులు పెట్టాలంటూ సెక్షన్‌ ఆఫీసర్‌ సురేంద్రనాథ్‌ ఒత్తిడి చేశాడు. క్యాంపుల పేరుతో మెడిసిన్‌ పంపించినట్లు రాసుకొని ఓ రికార్డు తయారుచేయాలని డాక్టర్‌కు చెప్పాడు. అయితే డాక్టర్‌ ఒప్పుకోకపోవడంతో సెక్షన్‌ ఆఫీసర్‌ బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా మరో మహిళా డాక్టర్‌కు కూడా సురేంద్ర ఫోన్‌ చేసి బెదిరించాడు. ఏడాది తర్వాత క్యాంప్‌ నిర్వహించినట్లు బిల్లులు తయారు చేయాలని ఆ మహిళా వైద్యురాలిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే ఏడాది తర్వాత బిల్లులు తయారు చేయలేనని ఆ ఈఎస్‌ఐ డాక్టర్‌ తెగేసి చెప్పారు. అయితే డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ బిల్లుల కోసం అడుగుతున్నారని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ డాక్టర్‌ మాత్రం నిబంధనల ప్రకారమే ముందకు వెళ్తానని సురేంద్రకు స్పష్టంగా చెప్పారు.  

ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరోవైపు నిందితుల ఇళ్లలో సోదాలు కొనసాగాతున్నాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దేవికారాణితోపాటు వరంగల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.పద్మ, అడిషనల్‌ డైరెక్టర్‌ వసంత ఇందిర, ఫార్మసిస్ట్‌ రాధిక, రిప్రజెంటేటివ్‌ శివ నాగరాజు, సీనియర్‌ అసిస్టెంట్‌ హర్షవర్ధన్, ఆమ్ని మెడికల్‌కు చెందిన హరిబాబు అలియాస్‌ బాబ్జీలను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయంలో ప్రశ్నించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 455 (ఏ), 465, 468, 471, 420, 120–బీ 34 కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారికి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ కుంభకోణానికి సంబంధించి 17మంది ఐఎంఎస్‌ ఉద్యోగులు, ఐదుగురు మెడికల్‌ కంపెనీల ప్రతినిదులు, ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌పై ఏసీబీ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 

చదవండి:
కర్త, కర్మ, క్రియా దేవికా రాణినే.. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top