‘సిరిసిల్ల’పై విద్యుత్‌ పోటు!  | Sakshi
Sakshi News home page

‘సిరిసిల్ల’పై విద్యుత్‌ పోటు! 

Published Wed, Mar 28 2018 3:17 AM

ERC issued the 2018-19 Annual Tariff  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సిరిసిల్ల గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (సెస్‌)’పై విద్యుత్‌ చార్జీల పిడుగు పడింది. రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు సెస్‌కు సరఫరా చేస్తున్న విద్యుత్‌ చార్జీలు ఒక్కసారిగా నాలుగున్నర రెట్లు పెరిగిపోనున్నాయి. రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) మంగళవారం జారీ చేసిన 2018–19 విద్యుత్‌ టారిఫ్‌ ఉత్తర్వుల్లో.. గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (రెస్కో)ల విద్యుత్‌ చార్జీలను పెంచింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గృహాలు, చేనేత, పవర్‌లూమ్స్, వ్యవసాయం, పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా చేస్తున్న సెస్‌కు సరఫరా అవుతున్న బల్క్‌ విద్యుత్‌ ధర ఒక్కో యూనిట్‌కు రూ.1 నుంచి రూ.4.52కు పెరగనుంది. వచ్చే నెల 1 నుంచి ఈ టారిఫ్‌ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. 

పెరగని సాధారణ చార్జీలు 
గృహ, వాణిజ్య, పరిశ్రమలు, ఇతర కేటగిరీల వినియోగదారులకు ప్రస్తుతమున్న చార్జీలనే వచ్చే ఏడాది కూడా కొనసాగించాలని ఈఆర్సీ నిర్ణయించింది. ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.6.40 నుంచి రూ.5.80కు తగ్గించింది. 

సర్కారు స్పష్టత ఇవ్వకపోవడంతోనే..! 
ఈఆర్సీ పౌల్ట్రీ పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌ చార్జీలను యూనిట్‌కు రూ.4 నుంచి రూ.6కు పెంచింది. పౌల్ట్రీ పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్‌పై యూనిట్‌కు రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని వచ్చే ఏడాది కొనసాగించే అంశంపై స్పష్టతివ్వకపోవడంతో చార్జీలు పెంచినట్లు ఈఆర్సీ తెలిపింది.  ఏటా సెస్‌కు ఇస్తున్న విద్యుత్‌ రాయితీ కొనసాగింపు పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రెస్కో కేటగిరీ చార్జీలను పెంచినట్లు తెలుస్తోంది. ఓపెన్‌యాక్సెస్‌ విద్యుత్‌పై యూనిట్‌కు 0.52 పైసల చొప్పున అదనపు సర్‌చార్జీని.. హెచ్‌టీ కేటగిరీలో పరిశ్రమలపై రూ.1.30 నుంచి రూ.1.60 వరకు క్రాస్‌ సబ్సిడీ సర్‌చార్జీలను ఈఆర్సీ విధించింది. 

ఆదాయ లోటు రూ.956.67 కోట్లు 
డిస్కంలు తమ వార్షిక వ్యయం 2018–19లో రూ.35,714 కోట్లుగా ఉండనుందని.. ప్రస్తుత చార్జీలను అమలు చేస్తే రూ.9,700 కోట్లు లోటు ఏర్పడుతుందని గతంలో ఈఆర్సీకి ఇచ్చి న నివేదికలో తెలిపాయి. ఈఆర్సీ తాజాగా ఆదాయ లోటును గణించి రూ.5,940.47 కోట్ల కు తగ్గించింది. ఇక డిస్కంలకు రూ.4,984.30 కోట్లు సబ్సిడీగా ఇస్తామని ప్రభుత్వం ఈఆర్సీకి తెలిపింది. దీంతో డిస్కంల ఆదాయ లోటు రూ.956.67 కోట్లకు తగ్గనుంది.  

Advertisement
Advertisement