కరెంటోళ్ల కక్కుర్తి

Engineer Officials Cheat Discom Budget Hyderabad - Sakshi

సొంత వాటినే అద్దెకార్లుగా చూపుతున్న ఇంజనీర్లు

నెలకు సుమారు రూ.32 వేలకుపైగా చెల్లింపు

క్షేత్రస్థాయి ఇంజనీర్లకు అందని అద్దెకార్ల సేవలు

డిస్కం ఖజానాకు గండి కొడుతున్న ఉన్నతాధికారులు

సాక్షి, సిటీబ్యూరో:  నెలకు లక్షన్నరకుపైగా వేతనం పొందే ఇంజనీర్లు సొంతంగా ఓ కారు కొనుక్కోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదే అధికారి సొంతకారులో ఆఫీసుకు వస్తూ ఏజెన్సీ నుంచి అద్దెకు తీసుకున్న టాక్సీప్లేట్‌లో వచ్చినట్లు తప్పుడు బిల్లులు చూపించి డిస్కం ఖజానాకు గండికొడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత హోదాలో ఉన్న అధికారులకు సీఎండీ, సహా డైరెక్టర్లకు ఇన్నోవా వాహనాలు సమకూర్చింది. చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (సీజీఎం), సూపరింటిండెంట్‌ ఇంజనీర్‌(ఎస్‌ఈ), డివిజనల్‌ ఇంజనీర్‌(డీఈ), ఇతర అధికారులకు ఏజెన్సీల ద్వారా అద్దె వాహనాలను సమకూర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పలు నిబంధనలు రూపొందించింది.  ఏడాదికి ఒక్కో వాహనానికి రూ.3.80లక్షలు చెల్లిస్తుంది. అయితే కొంతమంది ఇంజనీర్లు ఇక్కడే కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉపయోగపడాల్సిన వాహనాలు ఇంజనీర్ల వారంతపు విహారయాత్రలకు, వ్యక్తిగత అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. అంతేకాదు సంబంధిత అధికారులే స్వయంగా వా హనాలు నడుపుతుండటం వల్ల డ్రైవర్లకు ఉపాధి లభించకుండా పోతోంది.  

నిరుద్యోగుల పొట్టకొడుతున్నడిస్కం ఇంజనీర్లు:  దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో పని చేస్తున్న కొంత మంది సీజీఎంలు, ఎస్‌ఈలు, డీఈలు సొంత వాహనాలను అద్దె వాహనాల జాబితాలో చేర్చి డిస్కం నుంచి బిల్లులు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర సమయంలో అందరికీ ఉపయోగపడాల్సిన ఈ వాహనాలు ఉన్నతాధికారుల ఇళ్లకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఈల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. అత్యవసర సమయంలో వారే స్వయంగా ఆటోలను అద్దెకు తీసుకుని ఘటనా స్థలాలకు చేరుకోవాల్సి వస్తుం ది. ఉన్నతాధికారి సొంతవాహనం కావడంతో క్షేత్రస్థాయి పర్యటనల సమయంలో వినియోగానికి కిందిస్థాయి అధికారులు వెనుకాడుతున్నారు. అదే లీజుకు తీసుకున్నదైతే అందరికీ అందుబాటులో ఉండేది.  

కార్మికుల పొట్టకొడుతున్నారు
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో ఏజెన్సీ నుంచి తీసుకున్న అద్దెకార్లు కాకుండా సొంత వాహనాలను టాక్సీ ప్లేట్‌గా చూపించి డిస్కం నుంచి నెలనెలా అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. పరోక్షంగా నిరుద్యోగుల పొట్టగొడుతూ తమ జేబులు నింపుకుంటున్నారు. ఇంజనీర్లు తాము వాడుతున్న వాహనాలకు టాక్సీప్లేట్‌ పెట్టకపోవడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన రవాణా పన్నులు కూడా ఎగవేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి ఫిర్యాదు కూడా చేశాం. –నాగరాజు, అధ్యక్షుడు,తెలంగాణ కాంట్రాక్ట్‌విద్యుత్‌ కార్మికుల సంఘం జేఏసీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top