కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రోత్సాహం

Encourage for pollution-free industries  - Sakshi

 హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని పరిశ్రమలను తరలిస్తాం

మంత్రి కె.తారకరామారావు

పటాన్‌చెరు: రాష్ట్రంలో కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని పాశమైలారంలో పరిశ్రమల వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పారిశ్రామిక పెట్టుబడులను స్వాగతిస్తున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామికాభివృద్ధిని కాంక్షిస్తోందన్నారు.

అయితే తమ ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పారిశ్రామికవాడలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. 1,120 పరిశ్రమలను ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతలికి తరలించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల తరలింపుపై అధ్యయనం చేయాల్సిందిగా ఈపీటీఆర్‌ఐ సంస్థకు సూచించినట్లు తెలిపారు.

సంస్థ నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్, జహీరాబాద్‌లోని బూచనెల్లి, పటాన్‌చెరులోని లక్డారం, పాశమైలారం, సిద్దిపేటలోని వెల్దుర్తి, రంగారెడ్డిలోని నవాబ్‌పేట, హుస్సేన్‌బాద్, అరకట్ల, రాకంచర్ల ప్రాంతాలకు ఓఆర్‌ఆర్‌ లోపలున్న పరిశ్రమలను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆ పారిశ్రామికవాడలకు వెళ్లాలని హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ పరిధిలోని పారిశ్రామికవేత్తలకు సూచిస్తామన్నారు. కాలుష్య నివారణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.

దీనిలో భాగంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసివేస్తామని తెలిపారు. కొందరు కాలుష్య వ్యర్థాలను పాడైన బోరు బావుల గొట్టాల ద్వారా భూమి పొరల్లోకి పంపిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారంలో ఉన్న అన్ని కాలుష్య పరిశ్రమలకు చెందిన ఘన, ద్రవ వ్యర్థాలను ట్రీట్‌ చేసే జీరో డిశ్చార్జ్‌ ట్రీట్‌ మెంట్‌ ప్లాంట్‌ను రూ.104 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ బాల మల్లు తదితరులు పాల్గొన్నారు.

రెండు విచిత్రాలు..  
భాష విషయంలో మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకటి కాదు.. రెండు విచిత్రాలు. కొందరేమో తెలుగువారై ఉండీ తెలుగులో మాట్లాడలేరు. తెలుగు మాతృభాష కాని వారు వచ్చి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతు న్నారు. మరొకటి.. మనవాళ్లు దుబాయ్, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు.

కానీ, హైదరాబాద్‌లో ఏ పెద్ద భవంతి నిర్మాణం పను ల్లోనైనా చూడండి.. అంతా ఇతర రాష్ట్రాల వారే. కనీసం 70 శాతం మంది బయటి వాళ్లే. మన వాళ్లే మో విదేశాల్లో ఒళ్లు వంచి పనిచేస్తారు. ఇక్కడ మాత్రం చేయరు’ అని వ్యాఖ్యానించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top