ఉప్పల్‌కు నయాలుక్‌!

Elevated corridor In Uppal Hyderabad - Sakshi

ఉప్పల్‌– నారపల్లి రూట్లో ఎలివేటెడ్‌ కారిడార్‌

మెట్రో కూతతో ఇప్పటికే హైటెక్‌ హంగులు సంతరించుకున్న ఉప్పల్‌ ప్రాంతం.. మరో సరికొత్త నిర్మాణానికి కేంద్రం కానుంది. ఇక్కడి నుంచి నారపల్లి వరకు నిర్మించనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌తో నయాలుక్‌ రానుంది. ఉప్పల్‌ రింగ్‌రోడ్డు నుంచి నారపల్లి వరకు 6.25 కి.మీ మేర ఆకాశమార్గంలో ఆరు వరుసల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఏర్పాట్లుచేస్తున్నారు. నిర్మాణ పనులకు ఈ నెల 5న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న వరంగల్‌ ప్రధానరహదారిని నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దితే యాదాద్రి, వరంగల్‌ ప్రయాణం మరింత సులువు కానుంది.     

సాక్షి,సిటీబ్యూరో: ఉప్పల్‌ కేంద్రంగా సుమారు రూ.626.8 కోట్ల అంచనా వ్యయంతో 6.25 కి.మీ. మేర ఉప్పల్‌–నారపల్లి మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఈ పనులను కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్‌ గడ్కరీ ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు రామంతాపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు నగరం చుట్టుపక్కల నిర్మించే పలు రహదారుల అభివృద్ధి పనులను సైతం కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కారిడార్‌ ఏర్పాటు, ప్రధాన రహదారి విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను బల్దియా అధికారులు వేగవంతం చేశారు. ఈ పనులను 14 నెలల్లోగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి మెదక్‌ వరకు 62.9 కి.మీ. మార్గంలో రూ.426.52 కోట్ల అంచనా వ్యయంతో బహుళ వరుసల రహదారిని నిర్మించే పనులకు సైతం కేంద్ర మంత్రి అదేరోజున శంకుస్థాపన చేయనున్నారు.

ఇక ఆరాంఘర్‌–శంషాబాద్‌మార్గంలో ఆరు లేన్ల రహదారిని 10.048 కి.మీ మార్గంలో రూ.283.15 కోట్ల అంచనా వ్యయంతో తీర్చిదిద్దనున్నారు. ఇక దశాబ్దాలుగా అంబర్‌పేట్‌ వాసులు ఎదురుచూస్తున్న అంబర్‌పేట్‌ నాలుగు లేన్ల ఫ్లైఓవర్‌ను 1.415 కి.మీ. మార్గంలో రూ.186.71 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. మొత్తంగా నగరం నలుచెరుగులా 80.613 కి.మీ. మార్గంలో ఎలివేటెడ్‌ కారిడార్లు, ఫ్లై ఓవర్, బహుళ వరుసల రహదారులను తీర్చిదిద్దేందుకు రూ.1523.18 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పనుల పూర్తితో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అవస్థలు తీరడంతో పాటు.. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇప్పటికే ఐటీ, బీపీఓ, కేపీఓ, పరిశ్రమల రంగాలకు కొంగుబంగారంగా నిలిచిన ఆయా ప్రాంతాలు తీరైన రహదారుల ఏర్పాటుతో అభివృద్ధికి చిరునామాగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top