ఈ కరెంటోళ్లకేమైందో..

EleCtricity Officers Negligence In Manchiryal Division - Sakshi

సాక్షి, జన్నారం (మంచిర్యాల) : మంచోడు మంచోడంటే మంచమెక్కి కూర్చున్నాడంట వెనుకటికి ఒకడు. సరిగ్గా అలాగే ఉంది రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ తీరు. తెలంగాణ రాష్ట్రాన్ని వెలుగులతో విరాజిల్లేలా చేస్తామని చెప్పిన అధికారులు సామాన్యుల కుటుంబాల్లో చీకట్లు నింపుతున్నారు. ఇటీవల మండలంలో జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనంగా మారాయి. పడిపోయిన విద్యుత్‌ వైర్లను సరి చేయడంలో విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది.

దీని ఫలితంగా పలువురు విద్యుత్‌ షాక్‌ బారిన పడి గాయాల పాలయ్యారు. మండలంలో జరిగిన సంఘటనలతో విద్యుత్‌ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల వీచిన ఈదురు గాలులకు మండలంలోని బంగారుతాండాకు వెళ్లే రోడ్డులో స్తంభాలు పడిపోయి, కొన్ని ప్రదేశాలలో విద్యుత్‌ స్తంభాలు వంగి తీగలు వేలాడుతున్నాయి. అయినా అధికారులు వాటిని సరి చేయకుండానే విద్యుత్‌ సరఫరా చేయడంతో ఆ గ్రామానికి బైక్‌పై వెళ్తున్న దత్తు అనే వ్యక్తి తీగలకు తగిలి విద్యుత్‌ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు.

కవ్వాల్‌ పోచమ్మ ఆలయం వద్ద కూడా ఈదురు గాలులకు స్తంభాలు నేల కూలి తీగలు తెగి కింద పడ్డాయి. వాటిని కూడా మరమ్మతులు చేయకుండానే విద్యుత్‌ సరఫరా చేశారు. పోచమ్మ తల్లి వద్దకు మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన కామన్‌పల్లి గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి ప్రకాశ్‌నాయక్‌ విద్యుత్‌ షాక్‌ గురై తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీగలను సరి చేయాలని, అవసరమైతే విద్యుత్‌ స్తంభం వేయాలని హాస్టల్‌ తాండా గ్రామ సర్పంచ్‌ , ఉప సర్పంచులు తీర్మానం చేసి విద్యుత్‌ అధికారులకు పంపినా కానీ ఎటువంటి స్పందన లేదని, ఇప్పటి వరకు విద్యుత్‌ తీగల్ని సరి చేయలేదని ఉప సర్పంచ్‌ బాలాజీ ఆరోపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top