ఆటో కాదు.. ఈటో! | Electric Autos Coming To Hyderabad Soon | Sakshi
Sakshi News home page

ఆటో కాదు.. ఈటో!

Jul 26 2019 1:39 AM | Updated on Jul 26 2019 7:53 AM

Electric Autos Coming To Hyderabad Soon - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్వరలో రాష్ట్ర రాజధానిలో ‘ఈటోస్‌’(ఎలక్ట్రిక్‌ ఆటోలు) రోడ్డెక్కనున్నాయి. కాలుష్యరహిత, పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ ఆటోలను అందుబాటులోకి తెచ్చేందుకు ఈటో మోటార్స్‌ సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, ఎంఎంటీఎస్‌ స్టేషన్లు, మెట్రో స్టేషన్ల నుంచి ఈ–ఆటోల (ఈటోలు)ను నడిపేందుకు ఆ సంస్థ వెయ్యి వాహనాలను సిద్ధం చేసింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే రోడ్డెక్కించనున్నారు. మొదట కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి ఈ–ఆటోల సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశల వారీగా సికింద్రాబాద్, నాంపల్లి, బేగంపేట, లింగంపల్లి, మల్కాజిగిరి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు ఎంఎంటీఎస్‌ స్టేషన్లకూ ఈ సదుపాయాన్ని విస్తరిస్తారు.

కాలనీలు, బస్తీలు, తదితర నివాస ప్రాంతాల నుంచి ప్రయాణికులను ప్రధాన రైల్వేస్టేషన్లకు చేరవేయడంతో పాటు, కాలనీలకు తీసుకెళ్లేందుకు ఈ–ఆటోలు సేవలందించనున్నట్లు ఈటో మోటార్స్‌ సంస్థ ప్రతినిధి వేణుగోపాల్‌రావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర రైల్వేస్టేషన్ల నుంచి కూడా ఈ–ఆటోలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మెట్రోస్టేషన్ల నుంచి కూడా వీటిని నడిపేందుకు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ లిమిటెడ్‌తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. మొదట 10 మెట్రో స్టేషన్ల నుంచి ఈ–ఆటోల సేవలు ప్రారంభించి ఆ తర్వాత అన్ని స్టేషన్లకు నడుపుతారు. 

రెండు రకాల సేవలు.. 
ఎలక్ట్రిక్‌ ఆటోలు, ఎలక్ట్రిక్‌ రిక్షాలుగా ఈటోస్‌ రవాణా సదుపాయాన్ని అందజేస్తాయి. 25 కిలోమీటర్‌ల వేగంతో నలుగురు ప్రయాణించేందుకు అనువుగా ఉన్న రిక్షాలను ఆ సంస్థ ‘ప్రిన్స్‌’గా నామకరణం చేసింది. ముఖ్యంగా మహిళలు నడిపేందుకు అనువుగా ఉన్న ఈ–రిక్షాలు అతి తక్కువ దూరంలోని కాలనీలకు సదుపాయంగా ఉంటాయి. 3 గంటల పాటు చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్ల వరకు నడపొచ్చు. ఇప్పుడు ఉన్న మూడు సీట్ల ప్యాసింజర్‌ ఆటోల తరహాలోనే ఈ–ఆటోలను రూపొందించారు. ఇవి సూపర్‌కింగ్, కైటో అని రెండు రకాలుగా ఉన్నాయి. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఈ రెండు రకాల ఎలక్ట్రిక్‌ వాహనాలను రైల్వేస్టేషన్‌ల నుంచి నడిపేందుకు ఈటో మోటార్స్‌ సిద్ధంగా ఉంది. ఇప్పటికే కాచిగూడ రైల్వేస్టేషన్ల వద్ద ఈ–ఆటోల కోసం ప్రత్యేకంగా గ్రీన్‌షెడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ షెడ్లలోనే వాటికి చార్జింగ్‌ సదుపాయం ఉంటుంది. మోవో అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆసక్తి ఉన్న మహిళా డ్రైవర్లకు శిక్షణ ప్రారంభించారు. ఈ–ఆటోల్లో 50 శాతం మహిళలే నడిపేలా ఈటోస్‌ సంస్థ కార్యాచరణ చేపట్టింది. ఇందుకు హైదరాబాద్‌లోని నిరుపేద మహిళలు, స్వయం సహాయక గ్రూపుల సభ్యులకు శిక్షణనిస్తున్నారు. 

అందుబాటులోకి ఈటో యాప్‌.. 
ఉబర్, ఓలా క్యాబ్‌లు అందజేస్తున్నట్లు ఈటో యాప్‌ ద్వారా ఈ–ఆటోల ప్రయాణ సదుపాయం లభిస్తుంది. రైల్వేస్టేషన్‌లో దిగ్గానే ప్రయాణికులు తాము వెళ్లాల్సిన చోటుకు దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. పాలీగ్రాఫిక్‌ జీఆర్‌పీఎస్‌ వ్యవస్థ ద్వారా ఈ ఆటోలను ట్రాక్‌ చేస్తారు. ప్రతి ఆటో దానికి నిర్దేశించిన 5 కిలోమీటర్ల పరిధిలోని కాలనీల్లో రాకపోకలు సాగిస్తుంది. ఎక్కువ దూరం వెళ్తే ఈ జీఆర్‌పీఎస్‌ ద్వారా డ్రైవర్‌కు హెచ్చరికలు అందుతాయి. వెంటనే ఆటో ఆగిపోతుంది. ఆ మార్గంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో డ్రైవర్‌ చెప్పిన తర్వాతే తిరిగి అనుమతిస్తారు. ప్రయాణికులకు భద్రత ఉంటుంది. మహిళలు నడిపే ఆటోల్లో ప్రయాణికులతో పాటు, మహిళా డ్రైవర్లకు కూడా రక్షణ ఉండే లా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుత ఆటోలు కిలోమీటర్‌కు రూ.11 చొప్పున వసూలు చేస్తుండగా, ఈ–ఆటోల్లో చార్జీలు తక్కు వే ఉంటాయని, రూ.10 కన్నా తక్కువే ఉండొచ్చని సంస్థ ప్రతినిధులు చెప్పారు. 

పర్మిట్లు అవసరం లేదు.. 
ఎలక్ట్రిక్‌ వాహనాలపై ప్రభుత్వం ఆగస్టు మొదటి వారం లో ఆచరణాత్మకమైన విధానాన్ని ప్రకటించే అవకాశముంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు రవాణాశాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే సేవలందిస్తామని వేణుగోపాల్‌ వివరించారు. ఎలక్ట్రిక్‌ ఆటోల కోసం డ్రైవర్‌లు ప్రత్యేక పర్మిట్‌లు తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటిపై 5% జీఎస్టీని కేంద్రం విధించింది. పైగా మార్కె ట్‌లో రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లభించే ఈ ఆటోలకు కేంద్రం రూ.30 వేల వరకు సబ్సిడీ అందజేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తే ఆటోడ్రైవర్‌లకు లక్ష రూపాయలకే లభించే అవకాశముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement