‘అసెంబ్లీ’ ఓటర్ల లిస్ట్‌తో మున్సి‘పోల్స్‌’

Elections within 20 days if the government completes the process - Sakshi

ప్రభుత్వం ప్రక్రియ పూర్తిచేస్తే 20 రోజుల్లోనే ఎన్నికలు

హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి

సాక్షి, హైదరాబాద్‌: ‘మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ప్రక్రియను పూర్తి చేసిన ఇరవై రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధంగా ఉంది. అయితే కొత్త మున్సిపల్‌ చట్టం రూపొందించిన నేపథ్యంలో సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ నిమిత్తం పది రోజు లు గడువు నిర్ణయిస్తూ ఈ నెల 16న నోటిఫికేషన్‌ వెలువడింది. హైకోర్టు కేసుల కారణంగా అందుకు మరో ఏడు రోజులు సమయం అవసరమైంది’ అని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా, వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వంటివి ప్రభుత్వమే చేయాలని, వార్డుల హద్దుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమై తే సమస్యలు వస్తాయని, 2016లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలప్పుడు డివిజన్‌ హద్దుల విషయంలో సమస్యలు వచ్చాయని ఆయన తెలిపారు.

ఈ పరిస్థితుల్లో ఇటీవల అసెంబ్లీ, లోక్‌సభలకు జరిగిన ఎన్నికల నాటి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఆ జాబితాకు గడువు తగ్గించినా పర్వాలేదన్నారు. ప్రభు త్వం హడావుడిగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడాన్ని తప్పుపడుతూ నిర్మల్‌ జిల్లా నుంచి కె.అంజుకుమార్‌రెడ్డి వేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ఎస్‌ఈసీ తరఫున ఆయన హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటివరకూ జరిగిన పరిణామాలను, ప్రభుత్వం రాసిన లేఖలు, దానికి ఇచ్చిన జవాబుల గురించి సమగ్రంగా హైకోర్టుకు ఎస్‌ఈసీ వివరించింది. పిల్‌ను కొట్టేసి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.  

రాజ్యాంగంలోని 243–జెడ్‌ఏ అధికరణ ప్రకారం ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియ ప్రభుత్వం చేయాలి. 2018 డిసెంబర్‌ 31 నాటికి వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తి చేయాలని అదే ఏడాది సెప్టెంబర్‌ 15న ప్రభుత్వానికి లేఖ రాశాం. ఈ ఏడాది మార్చి 28 నాటికి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని కోరాం. ప్రభుత్వం మార్చి 12న రాసిన లేఖలో తెలంగాణ మున్సిపల్‌ చట్టం– 1965 స్థానంలో కొత్త చట్టాన్ని తేబోతున్నామని, అందుకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రచురణ గడువును పొడిగించాలని కోరింది. దాంతో మార్చి 14 వరకూ ఆ ప్రక్రియను నిలిపివేశాం. మే 10 నాటికి ఎన్నికల ముందస్తు ప్రక్రియ, రిజర్వేషన్ల ఖరారు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం.

ఏప్రిల్‌ 3న రాష్ట్రం రాసిన లేఖలో.. ‘కొత్త మున్సిపల్‌ చట్టం తుది దశకు చేరింది. ఏప్రిల్‌ మూడో వారానికి వార్డుల పునర్విభజన పూర్తి అవుతుంది’ అని తెలిపింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన కౌం టర్‌లో తెలిపారు. ఈ నెల 7కి పునర్విభజన ప్రక్రియ, 14కి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఓటర్ల జాబితా సవరణ కోసం పది రోజులు గడువు నిర్ణయిస్తూ జూలై 16న నోటిఫికేషన్‌ వెలువడినా.. హైకోర్టులో రిట్ల దాఖలుతో మరో ఏడు రోజు లు అవసరమైంది. ప్రభుత్వం వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, తమకు నివేదించిన 20 రోజుల్లోగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ హైకోర్టుకు తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top