‘లోక్‌సభ’కు రెడీ 

Elections Officers Ready To 2019 Lok Sabha Elections - Sakshi

సాక్షిప్రతినిధి, వరంగల్‌: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించిన అధికారులు ఇక లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. ఈ నెల 8న ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అవుతుందన్న ప్రచారంతో మరోసారి అప్రమత్తం అయ్యారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లతో ఏర్పాట్లపై సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికల పనుల్లో బిజీ అయిన అధికారులు ఇప్పటికే పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి చివరి వారంలోనే ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని భావించినప్పటికీ భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దులో ఉద్రిక్తత వల్ల జాప్యమైనట్లు చెప్తున్నారు. అయితే ఈ నెల 8న.. లేదంటే రెండోవారంలో షెడ్యూల్‌ ఖాయమన్న సంకేతాల మేరకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంమవుతోంది.

ఏడు జిల్లాలు.. 14 అసెంబ్లీ నియోజకవర్గాలు..
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో ఉండే ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు... జిల్లాల పునర్విభజన తర్వాత ఏడు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. వరంగల్‌ లోక్‌సభ స్థానం కింద వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, వర్దన్నపేట అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు చేయగా, మిగతా వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. అదేవిధంగా మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌ రూరల్‌ జిల్లాల పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు మహబూబాబాద్‌ (ఎస్టీ) లోక్‌సభ స్థానం కింద ఉన్నాయి. ఇందులో నర్సంపేట జనరల్‌కు మినహాయిస్తే, డోర్నకల్, మహబూబాబాద్, ములుగు, ఇల్లందు, పినపాక, భద్రాచలం సెగ్మెంట్లు ఎస్టీలకు రిజర్వు చేయబడ్డాయి.

30.68 లక్షల మంది ఓటర్లు...
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్, మహబూబా బాద్‌ లోక్‌సభ స్థానాలు ఉండగా... వీటి పరిధిలో 30,67,684 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం పరిధిలో 16,53,474 మంది ఓట ర్లు ఉండగా, ఇందులో పురుషులు 8,23,582 కాగా, మహిళలు 8,29,716, ఇతరులు 176 మం ది ఉన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 14,14,210 మంది ఓటర్లు ఉండగా, 6,98,325 పురుషులు, 7,15,848 మహిళలు కాగా, ఇతరులు 37 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఈ రెండు స్థానాల్లోనూ మహిళా ఓటర్లే స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇటీవల ఓటర్ల నమోదుకు అవకాశం ఇచ్చినప్పటికీ అంతగా మార్పు ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు.
 
3,577 పోలింగ్‌ కేంద్రాలు... 
రెండు లోక్‌సభ స్థానాల పరి«ధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 3,577 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఆయా పోలింగ్‌ కేంద్రాలలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసే విధంగా వరంగల్‌ అర్బన్, మహబూబాబాద్‌ జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్, సీహెచ్‌.శివలింగయ్య ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమన్వయం చేస్తున్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌తో కలిసి కలెక్టర్‌ జీవన్‌ పాటిల్‌ ఎన్నికల విధులు నిర్వహించే వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వరంగల్‌ లోక్‌సభ రిటర్నింగ్‌ అధికారిగా ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ వ్యవహరించనుండగా, వరంగల్‌ పశ్చిమకు ఆర్‌డీవో వెంకారెడ్డి, తూర్పునకు నగర కమిషనర్‌ రవికిరణ్, వర్ధన్నపేటకు వైవీ.గణేష్‌లను సహాయ రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు.

ఇదే క్రమంలో శాసనసభ ఎన్నికల్లో నియమించిన సెక్టోరియల్, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను తిరిగి పునరుద్ధరించారు. వాహనాల వినియోగం, ర్యాలీలు, సభల నిర్వహణకు ఆన్‌లైన్‌లో కనీసం 48 గంటల ముందు సువిధ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది.  లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా సరే... సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top