జేఈఈ మెయిన్ సవరణ.. రాష్ట్ర విద్యార్థికి రెండో ర్యాంకు! | EE Main ranked second amendment to the student by the state | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్ సవరణ.. రాష్ట్ర విద్యార్థికి రెండో ర్యాంకు!

Published Sun, Jul 5 2015 1:51 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

ఇంటర్మీడియట్ మార్కులను పంపించని కారణంగా జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు లభించని రాష్ట్ర విద్యార్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది.

చొరవకు ప్రతిఫలం లభించింది: కడియం
8వ తేదీన అందరికీ రివైజ్డ్ ర్యాంకులు

 
 హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కులను పంపించని కారణంగా జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు లభించని రాష్ట్ర విద్యార్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. శనివారం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించిన ఫ్రాక్షనల్ ర్యాంకుల్లో దాదాపు 200 మంది రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. రాష్ట్ర విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చినట్లు తెలిసింది. జూన్ 30న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ర్యాంకులు కేటాయించకపోవడం తెలిసిందే. ఇంటర్ బోర్డు రాష్ట్ర విద్యార్థుల మార్కులు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవ తీసుకుని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రం జీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ఢిల్లీకి పంపి, ర్యాంకులొచ్చేలా చర్యలు చేపట్టారు. దాదాపు 1300 మంది విద్యార్థుల మార్కులను సీబీఎస్‌ఈకి ఇవ్వగా, వందల మందికి ర్యాంకులొచ్చినట్టు తెలిసింది. వారందరికి ఫ్రాక్షనల్ ర్యాంకులు (ఉదాహరణకు, 100వ ర్యాంకు ఇదివరకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి 100.1 ర్యాంకు ఇస్తారు) ఇచ్చారు. దీంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టారు. మొదటి దశ వెబ్ ఆప్షన్లు ఆదివారం దాకా ఇచ్చుకునే అవకాశముంది. 6న (సోమవారం) వారి కేటాయింపును ఖరారు చేసి వాటిని 7న ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల నుంచి 8న ఆమోదం తీసుకుంటారు. మిగిలిన సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచుతారు. మన విద్యార్థులకు ర్యాంకులు కేటాయించకపోవడం తననెంతో ఆందోళన పరిచిందని, శనివారం ర్యాంకుల ప్రకటన తరువాత ఊపిరి పీల్చుకున్నానని కడియం పేర్కొన్నారు.

 రివైజ్డ్ ర్యాంకులతో రెండో దశ కౌన్సెలింగ్
 ప్రస్తుతం రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో 8వ తేదీ ఫ్రాక్షనల్ ర్యాంకు తొలగించి జాతీ య స్థాయిలో అందరికి కొత్త ర్యాంకులను ఇవ్వనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ ప్రకటన జారీ చేసింది. దీంతో విద్యార్థులు అందరి ర్యాంకులు మారనున్నాయి. మార్పు చేసిన ర్యాంకులతో విద్యార్థులు అందరిని రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతించనున్నారు. వాటి ప్రకారం సీట్లను కేటాయిస్తారు.
 
అవసరమైతే సూపర్ న్యూమరరీ సీట్లు: ఎంపీ సింగ్
ఇదివరకు ఒక ర్యాంకు ఒక విద్యార్థికి కేటాయించిన తరవాత అదే ర్యాంకు వచ్చిన రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులివ్వడంతో... సీట్ల కేటాయింపు విషయంలో విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే మొదట ర్యాంకు పొందిన విద్యార్థి, ఫ్రాక్షనల్ ర్యాంకు పొందిన మన రాష్ట్ర విద్యార్థి ఒకే కాలేజీలో, ఒకే బ్రాంచీలో సీట్లు కోరుకుని, మొదటి ర్యాంకర్‌తోనే ఆ కాలేజీలో ఆ బ్రాంచీలో సీట్లు నిండిపోతే రాష్ట్ర విద్యార్థికి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడనుందన్నమాట. కానీ, అలాంటప్పుడు మన రాష్ట్ర విద్యార్థికి అదే కాలేజీలో, అదే బ్రాంచీలో సూపర్‌న్యూమరరీ సీటు కేటాయిస్తామని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్‌ఏబీ) కోఆర్డినేటర్ ఎంపీ సింగ్ పేర్కొన్నారు.అలాంటి సందర్భం పెద్దగా రాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement