The Central Board of Secondary Education
-
ఒకే సంస్థ ఆధ్వర్యంలో ‘జాతీయ’ పరీక్షలు
► నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఏర్పాటు దిశగా అడుగులు ► కసరత్తు చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ► 2018 నుంచి అమల్లోకి తెచ్చే ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్షలను ఇకపై ఒకే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేలా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) వంటి పరీక్షలు నిర్వహిస్తుండగా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సీమ్యాట్, జీప్యాట్ వంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏదేని ఓ ఐఐటీ ఏటా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తోంది. ఇలా ఒక్కో సంస్థ ఒక్కో ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదన చాలాకాలంగా ఉంది. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్ఈ జేఈఈ మెయిన్ నిర్వహిం చడం, ఆ ఫలితాలు వస్తేనే ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఫలి తాల వెల్లడి వంటి విషయాల్లో ఒక్కోసారి సమన్వయం కొరవడుతోంది. మరోవైపు వేర్వేరు ప్రవేశాల వల్ల కూడా గందరగోళం నెలకొంటోంది. అందుకే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా)ని ఏర్పాటు చేసింది. అలాగే ప్రవేశ పరీక్షలను కూడా ఒకే సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు(ఎన్టీఎస్) ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ఆదేశించారు. దీంతో ఎన్టీఎస్ ఏర్పాటుపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్టీఎస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణను 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. -
జేఈఈ మెయిన్ సవరణ.. రాష్ట్ర విద్యార్థికి రెండో ర్యాంకు!
చొరవకు ప్రతిఫలం లభించింది: కడియం 8వ తేదీన అందరికీ రివైజ్డ్ ర్యాంకులు హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కులను పంపించని కారణంగా జేఈఈ మెయిన్‌లో ర్యాంకులు లభించని రాష్ట్ర విద్యార్థులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. శనివారం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించిన ఫ్రాక్షనల్ ర్యాంకుల్లో దాదాపు 200 మంది రాష్ట్ర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. రాష్ట్ర విద్యార్థికి రెండో ర్యాంకు వచ్చినట్లు తెలిసింది. జూన్ 30న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు ర్యాంకులు కేటాయించకపోవడం తెలిసిందే. ఇంటర్ బోర్డు రాష్ట్ర విద్యార్థుల మార్కులు ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చొరవ తీసుకుని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రం జీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ఢిల్లీకి పంపి, ర్యాంకులొచ్చేలా చర్యలు చేపట్టారు. దాదాపు 1300 మంది విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి ఇవ్వగా, వందల మందికి ర్యాంకులొచ్చినట్టు తెలిసింది. వారందరికి ఫ్రాక్షనల్ ర్యాంకులు (ఉదాహరణకు, 100వ ర్యాంకు ఇదివరకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి 100.1 ర్యాంకు ఇస్తారు) ఇచ్చారు. దీంతో వారు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టారు. మొదటి దశ వెబ్ ఆప్షన్లు ఆదివారం దాకా ఇచ్చుకునే అవకాశముంది. 6న (సోమవారం) వారి కేటాయింపును ఖరారు చేసి వాటిని 7న ప్రకటిస్తారు. సీట్లు పొందిన విద్యార్థుల నుంచి 8న ఆమోదం తీసుకుంటారు. మిగిలిన సీట్లను రెండో దశ కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచుతారు. మన విద్యార్థులకు ర్యాంకులు కేటాయించకపోవడం తననెంతో ఆందోళన పరిచిందని, శనివారం ర్యాంకుల ప్రకటన తరువాత ఊపిరి పీల్చుకున్నానని కడియం పేర్కొన్నారు. రివైజ్డ్ ర్యాంకులతో రెండో దశ కౌన్సెలింగ్ ప్రస్తుతం రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులు ఇచ్చిన నేపథ్యంలో 8వ తేదీ ఫ్రాక్షనల్ ర్యాంకు తొలగించి జాతీ య స్థాయిలో అందరికి కొత్త ర్యాంకులను ఇవ్వనున్నారు. ఈ మేరకు సీబీఎస్ఈ ప్రకటన జారీ చేసింది. దీంతో విద్యార్థులు అందరి ర్యాంకులు మారనున్నాయి. మార్పు చేసిన ర్యాంకులతో విద్యార్థులు అందరిని రెండో దశ కౌన్సెలింగ్‌కు అనుమతించనున్నారు. వాటి ప్రకారం సీట్లను కేటాయిస్తారు. అవసరమైతే సూపర్ న్యూమరరీ సీట్లు: ఎంపీ సింగ్ ఇదివరకు ఒక ర్యాంకు ఒక విద్యార్థికి కేటాయించిన తరవాత అదే ర్యాంకు వచ్చిన రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులివ్వడంతో... సీట్ల కేటాయింపు విషయంలో విద్యార్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. అయితే మొదట ర్యాంకు పొందిన విద్యార్థి, ఫ్రాక్షనల్ ర్యాంకు పొందిన మన రాష్ట్ర విద్యార్థి ఒకే కాలేజీలో, ఒకే బ్రాంచీలో సీట్లు కోరుకుని, మొదటి ర్యాంకర్‌తోనే ఆ కాలేజీలో ఆ బ్రాంచీలో సీట్లు నిండిపోతే రాష్ట్ర విద్యార్థికి అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడనుందన్నమాట. కానీ, అలాంటప్పుడు మన రాష్ట్ర విద్యార్థికి అదే కాలేజీలో, అదే బ్రాంచీలో సూపర్‌న్యూమరరీ సీటు కేటాయిస్తామని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) కోఆర్డినేటర్ ఎంపీ సింగ్ పేర్కొన్నారు.అలాంటి సందర్భం పెద్దగా రాదన్నారు. -
రేపు జేఈఈ మెయిన్ ఫలితాలు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను ఈనెల 27వ తేదీన వెల్లడించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కీ విడుదల చేసి, 22వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించారు. 27న ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతోపాటు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపిక చేసిన టాప్ 1.5 లక్షల మంది విద్యార్థుల జాబితాను కూడా అదే రోజున ప్రకటిస్తారు. జేఈఈ మెయిన్ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీలను కలిపి ఆలిండియా తుది ర్యాంకులను జూలై 7న ప్రకటిస్తారు. వాటి ఆధారంగా ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలను చేపడతారు. అడ్వాన్స్‌డ్‌కు మే 2 నుంచి దరఖాస్తులు.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణకు సీబీఎస్ఈ చర్య లు చేపట్టింది. ఈ పరీక్షను మే 24న నిర్వహించనుంది. మెయిన్‌లో అత్యధిక మా ర్కులు సాధించిన 1.5 లక్షల మందికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్డ్ రాసే అర్హత ఉంటుంది. వారు మే 2 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 24న పరీక్ష నిర్వహించి జూన్ 18న ఫలితాలు ప్రకటిస్తారు.