
ఒకే సంస్థ ఆధ్వర్యంలో ‘జాతీయ’ పరీక్షలు
జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్షలను ఇకపై ఒకే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేలా కేంద్ర
► నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఏర్పాటు దిశగా అడుగులు
► కసరత్తు చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ
► 2018 నుంచి అమల్లోకి తెచ్చే ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్షలను ఇకపై ఒకే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేలా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) వంటి పరీక్షలు నిర్వహిస్తుండగా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సీమ్యాట్, జీప్యాట్ వంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏదేని ఓ ఐఐటీ ఏటా జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తోంది.
ఇలా ఒక్కో సంస్థ ఒక్కో ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదన చాలాకాలంగా ఉంది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్‌ఈ జేఈఈ మెయిన్ నిర్వహిం చడం, ఆ ఫలితాలు వస్తేనే ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఫలి తాల వెల్లడి వంటి విషయాల్లో ఒక్కోసారి సమన్వయం కొరవడుతోంది. మరోవైపు వేర్వేరు ప్రవేశాల వల్ల కూడా గందరగోళం నెలకొంటోంది. అందుకే ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా)ని ఏర్పాటు చేసింది.
అలాగే ప్రవేశ పరీక్షలను కూడా ఒకే సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు(ఎన్‌టీఎస్) ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ఆదేశించారు. దీంతో ఎన్‌టీఎస్ ఏర్పాటుపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్‌టీఎస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణను 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.