చేతులు కాలాకా..

Education department Seized vagheshwari school In Vemulawada - Sakshi

సాక్షి, వేములవాడ : నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లు నడుపుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరించిన విద్యాశాఖ, ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోని రవాణా శాఖ అధికారులకు ముగ్గురు విద్యార్థుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయిన తర్వాత కనువిప్పు కలిగింది. ‘చేతుల కాలాకా.. ఆకులు పట్టుకున్నారన్న చందంగా’ విద్యాశాఖ, రవాణాశాఖ తేరుకుని చర్యలకు పూనుకుంది. ఈనెల 28న వేములవాడ బస్‌డిపో ప్రాంతంలో డివైడర్‌ను ఢీకొని వ్యాన్‌ బోల్తా పడటంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కంటి తుడుపు చర్యల్లో భాగంగా విద్యాశాఖ అధికారులు గురువారం వేములవాడ పట్టణంలోని వాగేశ్వరీ స్కూల్‌ను సీజ్‌ చేశారు. ఇక రవాణాశాఖ అధికారులు హడావిడిగా వేములవాడ ప్రాంతానికి చేరుకుని వాహనాల తనిఖీలు ప్రారంభించారు. వేములవాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడటంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు పెల్లుబకడంతో రాబోయే ప్రమాదాలనను ముందే పసిగట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారుల బలికావడంపై యావత్‌ సమాజం అధికార యంత్రాంగంపై దుమ్మెత్తి పోస్తోంది. 

తేరుకున్న విద్యాశాఖ.. వాగేశ్వరి స్కూల్‌ సీజ్‌
వేములవాడలో అనుమతులు లేకుండా నడుస్తున్న వాగేశ్వరి పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడటంతో విద్యాశాఖ తేరుకుంది. గురువారం స్థానిక పోలీసులకు సమాచారం అందించి పట్టణంలోని వాసుదేవా టవర్స్‌లో నిర్వహిస్తున్న వాగేశ్వరీ స్కూల్‌ను ఎంఈవో కే.సురేశ్‌ సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అనుమతులు లేవని, హాస్టల్‌ నడిపించడం రూల్స్‌లో లేవన్నారు. రూల్స్‌కు విరుద్ధంగా నడుస్తున్న వాగేశ్వరి స్కూల్‌ను సీజ్‌ చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్కూల్‌ను సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. చిన్నారుల మృతికి కారణమైన స్కూల్‌ యాజమాన్యంపై, వ్యాన్‌ డ్రైవర్‌ రఫీక్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ ఎన్‌. వెంకటస్వామి తెలిపారు. 

అయోమయంలో పేరెంట్స్‌
వేములవాడ పట్టణంలోని వాగేశ్వరి స్కూల్‌ అనుమతులు లేకుండా నడుస్తుండటంతో గురువారం ఎంఈవో సురేశ్‌ సీజ్‌ చేశారు. దీంతో ఈ పాఠశాలలో చదువుతున్న వందలాది మంది విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో గురువారం పలువురు పేరెంట్స్‌ పాఠశాల వద్దకు చేరుకుని విషయం తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. 

నాలుగు వేలిచ్చుకో.. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పుచ్చుకో.. 
ప్రతీ ఏడాది వాహనాలకు తప్పకుండా ఫిట్‌నెస్‌ చేయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు గత జూన్‌ మాసంలోనే విద్యా సంస్థలకు చెందిన వ్యాన్లు, బస్సులు, మినీ బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించడంలో రవాణా శాఖ బిజీ అయ్యింది. ఈక్రమంలో ఒక్కో వాహనానికి రూ.4 వేల చొప్పున పైకం పుచ్చుకుని సర్టిఫికేట్లు ఇచ్చేసినట్లు పలువురు పాఠశాల యజమానులే పేర్కొంటున్నారు. ఫిట్‌నెస్‌ సమయంలో సరైన నిబంధనలు పాటిస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు కేవలం జూన్‌ మాసంలోనే హడావిడి సృష్టించి ఆ తర్వాత స్కూల్‌ వ్యాన్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి.

వేములవాడ ప్రాంతంలో ఎన్ని స్కూళ్లు ఉన్నాయి..? వాటికి ఎన్ని బస్సులు ఉన్నాయన్న అంశం ఆ శాఖ అధికారులకు తెలిసినప్పుడు మిగతా వాహనాలపై ఎందుకు దృష్టి సారించలేకపోయారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు మూలనపడిన కాలం చెల్లిన బస్సులను సైతం రోడ్లపై తిప్పుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరగడం, అమాయక విద్యార్థులు బలవుతున్నారు. బస్‌డిపో వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం సైతం బస్‌ ఫిట్‌నెస్‌ లేకపోవడమే ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది.  

అనుమతిలేని హాస్టల్‌ రద్దు 
రెండు నెలల క్రితం చింతాలఠాణ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన రేకుల షెడ్డులో వాగేశ్వరి పాఠశాల హాస్టల్‌ను ఏర్పాటు చేశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదని డీఈవో రాధాకిషన్‌ బుధవారం వెల్లడించారు. ఆ హస్టల్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 40 నుంచి 50 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఉదయం ఇక్కడి నుంచి విద్యార్థులు స్కూల్‌కు వ్యాన్‌లో వెళ్లి మధ్యాహ్నం భోజనానికి వ్యాన్‌లో వచ్చి వెళ్తారు. మళ్లీ సాయంత్రం హాస్టల్‌కు వస్తారు.

వరుసగా ఐదు రోజులు సెలవులు
విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పట్టణంలోని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు గురు, శుక్ర, శనివారాలు సెలవులు ప్రకటించారు. మరో రెండు రోజులు ఒకరోజు అదివారం, సోమవారం వినాయక చవితి కావడంతో విద్యార్థులకు ఐదు రోజులు సెలవులు ప్రకటించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top