నెలముందే పెట్టుబడి చెక్కులు 

EC On Rythu Bandhu Rabi Crop Loans Distribution - Sakshi

ఈసీ అంగీకరిస్తుందా లేదా అన్న దానిపై టెన్షన్‌

అంతా అనుకూలిస్తే అక్టోబర్‌ 5 నుంచే పంపిణీ 

సాక్షి, హైదరాబాద్‌ : రబీ పెట్టుబడి చెక్కులను నెల రోజుల ముందే రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే నెల 5 నుంచి చెక్కుల పంపిణీ మొదలు పెట్టాలని యోచిస్తోంది. 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద చెక్కుల పంపిణీపై దృష్టి సారించింది. వాస్తవంగా రబీ సీజన్‌కు సంబంధించిన రైతుబంధు చెక్కులను నవంబర్‌లో పంపిణీ చేయాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికల హడావుడి ఉంటుంది. ప్రజలు, అధికారులు ఎన్నికల పనుల్లో నిమగ్నమై ఉంటారు. పైగా షెడ్యూల్‌ జారీ చేశాక పంపిణీ వ్యవహారం క్లిష్టంగా మారనుంది. షెడ్యూల్‌ వచ్చాక ఎన్నికల కమిషన్‌ పంపిణీకి అనుమతి ఇస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ముందే పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం కూడా రిజర్వ్‌ బ్యాంకుకు ఇటీవల లేఖ రాసి అక్టోబర్‌లోనే బ్యాంకుల్లో నగదు ఉంచేలా చొరవ తీసుకోవాలని కోరినట్లు సమాచారం. అయితే వారం రోజుల్లో పంపిణీ చేసేలా చెక్కుల ముద్రణ చేపట్టాలని బ్యాంకులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. 

ఈసీ అంగీకరిస్తుందా? 
గత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి ప్రభుత్వం రైతుబంధు పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు సాయం అందిస్తోంది. రబీలోనూ పంట వేశారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా అందరికీ ఈ సాయం ఇవ్వనున్నారు. ఖరీఫ్‌లో 50 లక్షల మంది రైతులకు సొమ్ము అందజేశారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం రద్దు కావడం, ఎన్నికల ప్రక్రియ జరుగుతుండటం, ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ప్రతి రైతుకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చే వ్యవహారం కావడం, ఎన్నికల సమయంలో అంత సొమ్ము అందజేస్తే అధికార పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో రైతుబంధుపై ఎన్నికల కమిషన్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. ‘ఇది కొనసాగుతున్న కార్యక్రమం. పైగా బడ్జెట్‌లో రెండు సీజన్లకు కలిపి రూ.12 వేల కోట్లు కేటాయించాం.

కాబట్టి రబీలో పెట్టుబడి సొమ్ము పంపిణీ అంశంపై మేం ఈసీ అనుమతి తీసుకోం. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అప్పుడు చూస్తాం. అప్పటివరకు మా పని మేం చేసుకుంటూ పోతాం. అక్టోబర్‌ 5 నుంచి చెక్కుల పంపిణీని మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాం’ అని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఎవరైనా పార్టీ ప్రతినిధి బృందం వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప ఈ కార్యక్రమం నిలిచిపోదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈసీయే నిలిపేస్తే ఏంచేయాలన్న దానిపై చర్చిస్తామని చెప్పారు. ఒకవేళ చెక్కుల పంపిణీ వద్దంటే రైతు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము నేరుగా పడేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే లక్షలాది మంది రైతుల బ్యాంకు ఖాతాలున్నాయని, మిగిలిన రైతులవీ సేకరిస్తామని చెప్పారు. పైగా రబీలో రైతు పెట్టుబడి కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,925 కోట్లకు పరిపాలన అనుమతి కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. 

52 లక్షల మంది రైతులు.. 
ఖరీఫ్‌లో 58.33 లక్షల చెక్కులను వ్యవసాయ శాఖ ముద్రించింది. అందులో 50 లక్షల చెక్కులను రైతులు తీసుకున్నారు. ఈసారి ధరణి వెబ్‌సైట్‌ ద్వారా ఎలాంటి వివాదాలు లేని పట్టాదారు రైతులు 52 లక్షల మంది తేలినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. వారి పేరుతోనే చెక్కులను ముద్రిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఖరీఫ్‌లో ముద్రించిన చెక్కుల్లో చనిపోయిన రైతులవి, పలు లోపాలతో నిలిపేసినవి, ఇతరత్రా కారణాలతో పంపిణీ చేయనివి ఉన్నాయి. ఆయా పేర్లతో రబీ చెక్కులు ముద్రించబోమని అధికారులు చెబుతున్నారు. ఇక 1.9 లక్షల రైతు ఖాతాల విషయంలో ధరణి వెబ్‌సైట్‌లో తప్పులు ఉన్నట్లు చెబుతున్నారు. దీనివల్ల కొందరు రైతులను అన్యాయం జరిగే అవకాశముందన్న ఆరోపణలు వస్తున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top