డీఎస్సీ జోష్ | Sakshi
Sakshi News home page

డీఎస్సీ జోష్

Published Thu, Nov 26 2015 1:24 AM

dsc announced in state government.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలపై రాష్ట్ర సర్కారు స్పష్టతనిచ్చింది. పక్షం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. భారీ సంఖ్యలో భర్తీ అయ్యే ఉపాధ్యాయ ఉద్యోగాలకోసం గంపెడాశలు పెట్టుకున్న యువత.. వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే జిల్లాలో 1,300 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదికను జిల్లా విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించింది.
 
 ఎస్జీటీ ఖాళీలు 849..
 ఇతర జిల్లాలతో పోలిస్తే ఉపాధ్యాయ ఖాళీలు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓపెన్ కేటగిరీ పోస్టులపై ఇతర జిల్లాల అభ్యర్థులనుంచి పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే జిల్లాలో స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల వ్యత్యాసం నిబంధనలకు మించి ఉండడంతో తాజాగా నిర్వహించే డీఎస్సీ స్థానికులకే పరిమితం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిఉంది. ప్రస్తుతం విద్యాశాఖ గుర్తించిన ఖాళీల్లో 849 ఎస్జీటీలు ఉన్నాయి.
 
 సీఎం కేసీఆర్ నోట డీఎస్సీ మాట వినపడగానే టీచర్ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న యువతలో ఉత్సాహం రెట్టింపయింది. పక్షం రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడంతో ఉద్యోగాన్ని దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రత్యేక శిక్షణ కోసం కోచింగ్ సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, సికింద్రాబాద్, అమీర్‌పేట, మోహిదీపట్నం ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లల్లో జిల్లాకు చెందిన పలువురు శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా డీఎస్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో కోచింగ్ సెంటర్లు ఫీజులను అమాంతం పెంచేశాయి. ఇదివరకు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ శిక్షణ సంస్థ రూ.10వేల ఫీజు తీసుకుంటుండగా.. ప్రస్తుతం రూ.15వేలకు పెంచినట్లు కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి డి.నర్సింగ్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement