పూడిక.. లేదిక!

Drainage Cleaning Cleaning Starts in Hyderabad - Sakshi

ఇకపై నిరంతరం నాలాల పూడికతీత  

సంవత్సరం పొడవునా పనులు  

రూ.38.24 కోట్ల వ్యయం  

సాక్షి, సిటీబ్యూరో: నాలాల పునరుద్ధరణకు గ్రేటర్‌ అధికారులు నడుం బిగించారు. ఇకపై ఏడాది పొడవునా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ.38.24 కోట్ల వ్యయంతో 806 కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలాల పూడికతీత పనులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నగర పరిధిలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల విస్తీర్ణంలో మురుగునీటి కాలువలు, వరద నీటి కాలువలు ఉండగా... వీటిలో 216 మేజర్‌ నాలాలు, 735 కిలోమీటర్ల విస్తీర్ణంలో పైప్‌లైన్‌ డ్రెయిన్‌లు, చిన్న సైజు డ్రెయిన్‌లు ఉన్నాయి. మేజర్‌ నాలాల్లో మెషిన్ల ద్వారా, పైప్‌లైన్‌ డ్రెయిన్‌లలో రీసైక్లర్స్‌ ద్వారా, చిన్న సైజు నాలాల్లో మ్యాన్‌వల్‌గా పూడికతీత పనులు చేపట్టడానికి టెండర్‌ ప్రక్రియను పూర్తిచేసిన జీహెచ్‌ఎంసీ పనులు కూడా ప్రారంభించింది. గతంలో వర్షాకాలానికి నెల రోజుల ముందు మాత్రమే పూడికతీత పనులు ప్రారంభించి, వర్షాకాలం పూర్తి కాగానే నిలిపేసేవారు. ఈ విధానంలో పూడిక పనులు సకాలంలో పూర్తికాకపోవడం, వరదతో పూడిక మట్టి తిరిగి నాలాల్లో చేరడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విధానానికి స్వస్తి పలికిన జీహెచ్‌ఎంసీ ఏడాది పొడువునా పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం 92.10 కిలోమీటర్ల విస్తీర్ణంలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. ఇందులో 51,888 క్యూబిక్‌ మీటర్ల పూడికను తొలగించారు. మిగిలిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 

టార్గెట్‌ మే...
నగరంలో సుమారు 327 నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వీటిలో 83 మేజర్‌ నాలాల్లో యంత్రాల ద్వారా, 23 డ్రెయిన్‌లలో రీసైక్లర్స్‌ ద్వారా, 214 చిన్న సైజు నాలాల్లో మ్యాన్‌వల్‌గా జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ నిర్వహణ విభాగం పనులు చేపట్టింది. నాలాల్లో పూడికను తొలగించడంతో పాటు దాన్ని సమీపంలోని డంపింగ్‌ యార్డుకు తరలించే బాధ్యత కూడా కాంట్రాక్టర్‌పైనే ఉంటుంది. ఈ నెల చివరి నాటికి పనులు మొత్తం పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే తర్వాత కూడా వర్షాల వల్ల తిరిగి పూడిక ఏర్పడితే ఎప్పటికప్పుడు తొలగించే పనులు నిరంతరం కొనసాగనున్నాయి. ఎప్పటికప్పుడు నాలాల పూడికతీతతో నగరవాసులు ఇబ్బందులు ఉండవని, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని కమిషనర్‌ అన్నారు.  

పారదర్శకతకు సోషల్‌ ఆడిట్‌..   
నాలా పూడికతీత పనుల్లో అవకతవకలకు తావులేకుండా సోషల్‌ ఆడిట్‌ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ తెలిపారు. నగరంలో పూడిక పనుల సందర్భంగా తొలగించిన మట్టి పరిమాణం, తరలింపు, పాల్గొన్న కూలీలు, జేసీబీలతో కూడిన వివరాలను పొందుపరిచి స్థానిక ప్రముఖులతో ధ్రువీకరణ సంతకాలను కూడా సేకరించాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top