పార్టీల కొంప ముంచిన డబుల్ ఓటింగ్! | Double voting for some party! | Sakshi
Sakshi News home page

పార్టీల కొంప ముంచిన డబుల్ ఓటింగ్!

May 22 2014 12:33 AM | Updated on Sep 2 2017 7:39 AM

పార్టీల కొంప ముంచిన డబుల్ ఓటింగ్!

పార్టీల కొంప ముంచిన డబుల్ ఓటింగ్!

మహానగరంలో నివసిస్తున్న పలువురు సెటిలర్లు రెండు ప్రాంతాల్లో రెండు ఓట్లు వేసి పార్టీల ఫలితాలను తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  •     రెండు చోట్లా ఓటేశారు.. ఫలితాలు మార్చారు
  •      పట్టించుకోని ఎన్నికల సంఘం
  •      శివార్లలోనే బోగస్ ఓట్లు అత్యధికం
  •  సాక్షి, సిటీబ్యూరో, గచ్చిబౌలి, న్యూస్‌లైన్: మహానగరంలో నివసిస్తున్న పలువురు సెటిలర్లు రెండు ప్రాంతాల్లో రెండు ఓట్లు వేసి పార్టీల ఫలితాలను తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ప్రాంతంలో ఓటుహక్కు ఉండాలి. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు కలిగి ఉండి.. రెండు ప్రాంతాల్లోనూ దర్జాగా ఓటుహక్కు వినియోగించుకోవడం చట్ట విరుద్ధం. కానీ అతి విలువైన ఓటుహక్కును కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేసినా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు మిన్నకుండటం ఆందోళన కలిగిస్తోంది.

    గ్రేటర్ శివార్లలో సీమాంధ్ర జిల్లాలకు చెందిన వారు దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉంటారని ఓ అంచనా. వారిలో 90 శాతం మంది ఓటర్లు ఏప్రిల్ 30న నగర శివార్లలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. కానీ వీరిలో చాలామంది మే 7న సీమాంధ్ర జిల్లాలోనూ ఓటు వేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా డబుల్ ఓటింగ్ చేసిన ఓటర్ల కారణంగా శివారులో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు కోస్తా ఆంధ్రా జిల్లాల అభ్యర్థుల తలరాతలు తారుమారవడం గమనార్హం.
     
    కూకట్‌పల్లిలోనే అత్యధికం
     
    కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి మే 4వ తేదీ నుంచి 6వ తేదీ మధ్యకాలంలో సుమారు 50 వేల మంది ఓటర్లు సీమాంధ్ర జిల్లాలకు పోటెత్తడం కనిపించింది. కూకట్‌పల్లి నుంచి ఆరు వేల బస్సుల్లో వీరంతా స్వస్థలాలకు తరలి వె ళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ముఖ్యంగా కేపీహెచ్‌బీ, మూసాపేట, వసంతనగర్, మోతీనగర్, కూకట్‌పల్లిలో అత్యధికంగా సీమాంధ్ర జిల్లాలకు సంబంధించిన సెటిలర్స్ ఉన్నారు. వీళ్లంతా సొంతూళ్లకు తరలి వెళ్లడంతో నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లన్నీ కిటకిటలాడాయి. కేవలం మే 6వ తేదీన నగరవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది ప్రయాణికులు సీమాంధ్ర జిల్లాలకు తరలివెళ్లారు. వారంతా అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి రావడం గమనార్హం.
     
    శివారు నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు

     
    కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, సనత్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల పరిధిలోని కాలనీలు, బస్తీల్లో సీమాంధ్ర జిల్లాలకు చెందినవారు సుమారు 15 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఓ అంచనా. వారిలో ఎక్కువ శాతం మంది నగర శివారు నియోజకవర్గాలతో పాటు ఆంధ్ర నియోజకవర్గాల్లోనూ ఓటు హక్కును వినియోగించుకోవడం బహిరంగ రహస్యమే. ఇంత జరుగుతున్నా ఎలక్షన్ కమిషన్ ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఎన్నికల్లో ఓటమి చెందిన నాయకులను కలచి వేస్తోంది.
     
    డీ కోడ్ విధానం నిర్వీర్యం
     
    బోగస్ ఓట్లు తొలగించేందుకు డీ కోడ్ విధానాన్ని వినియోగిస్తారు. డీ కోడ్ సాఫ్ట్‌వేర్ ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటుహక్కు కలిగి ఉంటే ఇట్టే పసిగడుతుంది. ఈ క్రమంలో సదరు ఓటరు ఆప్షన్ తీసుకొని ఒక ప్రాంతంలో ఉన్న ఓటును రద్దు చేస్తారు. అలా చేసి ఉంటే ఓటర్లు రెండు చోట్ల ఓటు వేసేందుకు వీలుండేది కాదు. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓటర్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వెసులుబాటు ఉండటం.. బోగస్ ఓటర్లపై నిఘా లేకపోవడం.. తదితర కారణాల వల్ల యథేచ్ఛగా రెండు చోట్ల ఓటు వేసేందుకు వీలైందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
     
    టీడీపీ గెలుపునకు కారణం అదే..?
     
    ఎన్నికలకు ముందు నెల రోజుల వ్యవధిలోనే కుత్బుల్లాపూర్‌లో 60 వేలు, శేరిలింగంపల్లిలో 50 వేల మంది నూతనంగా ఓటర్ల జాబితాలో చేరారు. ఇలా శివార్లలో లక్షల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. వారంతా ఆంధ్రలోనూ ఓటుహక్కు కలిగి ఉండటం గమనార్హం. రెండు చోట్ల ఓటుహక్కును వినియోగించుకోవడం టీడీపీకి కలిసొచ్చిందని టీఆర్‌ఎస్ కూకట్‌పల్లి నియోజకవర్గ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు ఆరోపిస్తున్నారు. శివార్లలో టీడీపీ తొమ్మిది చోట్ల గెలవడానికి బోగస్ ఓట్లే కారణమని ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
     
     కోర్టును ఆశ్రయిస్తా

     ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసి గెలుపోటములు శాసించడం రాజ్యాంగ విరుద్ధం. పలువురు ఓటర్లు రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడంతో రెండు చోట్లా ఓటేశారు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తా. కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేస్తా. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే సెటిలర్లు భారీ సంఖ్యలో ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
     - గొట్టిముక్కల పద్మారావు, టీఆర్‌ఎస్ నాయకులు, కూకట్‌పల్లి
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement