వైద్యుల ఆందోళన తీవ్రరూపం

Doctors Protest in Hyderabad - Sakshi

అత్యవసర సేవల బహిష్కరణ

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనసాగుతున్న జూడాల ఆందోళన

గురువారం మధ్యాహ్నం నుంచి అత్యవసర సేవలకు దూరం

సాక్షి, సిటీబ్యూరో: జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ)బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు చేపట్టిన ఆందోళన మరింత తీవ్రరూపందాల్చింది. గత రెండు రోజుల నుంచి ఓపీ సేవలు బంద్‌ చేసి నిరసన తెలుపుతున్న వైద్య విద్యార్థులు తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి ఓపీ సహా అత్యవసర వైద్యసేవలను బహిష్కరించారు. దీంతో నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జూనియర్‌ వైద్యులంతా సమ్మెకు దిగడంతో మధ్యాహ్నం జరగాల్సిన పలు చికిత్సలు వాయిదా పడ్డాయి.  ఉస్మానియా ఆస్పత్రిలో యాభైకిపైగా చికిత్సలు వాయిదా పడగా, గాంధీలో 40పైగా చికిత్సలు వాయిదా వేశారు. బోధనాసుపత్రుల్లో పని చేస్తున్న సీనియర్‌ వైద్యులందరికీ తాత్కాలికంగా సెలవులను రద్దు చేశారు. ప్రస్తుతం ఆయా ఆస్పత్రుల అత్య వసర విభాగాల్లో ఫ్యాకల్టీ వైద్యులే విధులు నిర్వహిస్తున్నప్పటికీ.. ఇన్‌పేషంట్‌ వార్డుల్లో  చికిత్స పొందుతున్న రోగులను పట్టించుకునే వారే లేరు. నర్సులు, 108 సిబ్బందే పెద్దదిక్కుగా మారారు.  

నిమ్స్‌లో..
సోమాజిగూడ:  నిమ్స్‌లో గురువారం కొంతమేరకు ఓపీసేవలు అందించారు. నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యులు చేపట్టిన నిరసనను నిమ్స్‌ యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. వైద్యసేవలందిస్తూ నిరసనను తెలపవచ్చని, పూర్తిగా వైద్యులు ఆందోళన బాటపడితే ఆసుపత్రి ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఓ ప్రముఖ వైద్యుడు అన్నారు.  శుక్రవారం కూడా ఆందోళన కొనసాగుతోందని నిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు జి.శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు.  

గాంధీ ఆస్పత్రి..
గాంధీ ఆస్పత్రిలో సాధారణ విధులను మాత్రమే బహిష్కరించిన జూడాలు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. జూడాల సంఘం నాయకులు డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌లను కలిసి నోటీసు అందించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సాయంత్రం 4 గంటలకు ఆస్పత్రి ప్రాంగణంలోనే సామూహిక నిరాహరదీక్షలు చేపట్టారు.   అత్యవసర సేవలు బహిష్కరించడంతో ప్రాణాపాయస్థితిలో ఇక్కడకు వచ్చిన రోగులకు వైద్యం అందకపోవడంతో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. వెయ్యికి పైగా ఉన్న జూడాలు సాధారణ, అత్యసవర సేవలను బహిష్కరించడంతో 176 మంది వైద్యులు, మరో వంద మంది సర్వీసు పీజీలతో నెట్టుకొస్తున్నారు. మెదక్‌జిల్లా నార్సింగ్‌కు చెందిన శ్రీకాంత్‌ పరిస్థితి విషమంగా ఉండడం, గాంధీలో వైద్య సేవల్లో జాప్యం జరగడంతో అతని కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అత్యవసర సేవలు నిలిపివేస్తున్నట్లు జూడాలు హటాత్తుగా ప్రకటించారని, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top