రోగులు, బోధకులు లేకున్నా అనుమతులా? | Doubts over the conduct of National Medical Commission officials | Sakshi
Sakshi News home page

రోగులు, బోధకులు లేకున్నా అనుమతులా?

Jul 11 2025 12:56 AM | Updated on Jul 11 2025 6:12 AM

Doubts over the conduct of National Medical Commission officials

జాతీయ వైద్య కమిషన్‌ అధికారుల తీరుపై అనుమానాలు

కొన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో లోపాలు పట్టించుకోకుండా అడ్మిషన్లకు ఓకే 

కాళోజీ వర్సిటీ వసతుల్లేవని తేల్చిన 4 కాలేజీలకు ఒక్క రోజులోనే గ్రీన్‌సిగ్నల్‌ 

ఎన్‌ఎంసీ బృందంతో రాష్ట్ర వైద్యాధికారుల కుమ్మక్కు! 

రూ.కోట్లు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు 

ఈ వ్యవహారాలపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న వైనం  

ఎన్‌ఎంసీ సమావేశాలకు రాష్ట్ర మాజీ అధికారులు హాజరవుతుండటంపై విస్మయం

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ అదీనంలోని జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) తీరు కంచె చేనును మేసిన చందంగా తయారైందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతున్న ప్రైవేటు మెడికల్‌ కాలేజీల దందాకు అడ్డుకట్ట వేసి, విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందించేలా చూడాల్సిన ఎన్‌ఎంసీ అధికారులు లంచాలకు కక్కుర్తి పడుతూ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. 

ఆయా రాష్ట్రాల్లోని ప్రస్తుత, మాజీ వైద్యాధికారులతో కుమ్మక్కై ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి రూ.కోట్లలో లంచాలుగా తీసుకున్నట్లు గుర్తించిన సీబీఐ.. ఓవైపు దేశ వ్యాప్తంగా దర్యాప్తు సాగిస్తుండగా, మరోవైపు ఇదేమీ పట్టనట్లు వైద్య కమిషన్‌ అధికారులు తమ లాలూచీని కొనసాగిస్తూ అధ్వాన స్థితిలో ఉన్న ప్రైవేటు వైద్య కళాశాలలకు సైతం వందశాతం మార్కులు వేస్తూ వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు ఆమోదముద్ర వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి, ఏ మాత్రం వసతులు లేకున్నా.. కాలేజీలకు అనుమతులు కట్టబెడుతున్నారని తెలుస్తోంది.  

వర్సిటీ అలా..ఎన్‌ఎంసీ ఇలా 
రాష్ట్రంలోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇటీవల నాలుగు ప్రైవేటు కళాశాలల్లో తనిఖీలు జరిపి వైద్య విద్యకు అనువైన కనీస మౌలిక వనరులు లేవని, రోగులు, బోధనా సిబ్బంది లేకుండా ఏదో ‘సాంఘిక శాస్త్రం’బోధించినట్లుగా వైద్య విద్య అందిస్తున్నట్లు గుర్తించింది. ఈ మేరకు 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేసింది. 

విచిత్రమేంటంటే హెల్త్‌ యూనివర్సిటీ తనిఖీలు చేసిన కళాశాలల్లో ఒకటైన పటాన్‌చెరులోని రాజ రాజేశ్వరి మెడికల్‌ కాలేజీని బుధవారం సాయంత్రం సందర్శించిన ఎన్‌ఎంసీ అధికారులు 100 శాతం మార్కులు వేసినట్లు తెలుస్తోంది. 

ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆకస్మిక పర్యటన చేసినప్పుడు ఈ కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలోని వార్డుల్లోని బెడ్లన్నీ రోగులు, సిబ్బందితో పాటు కనీసం స్టూడెంట్లు కూడా లేక వెలవెలబోతున్నట్లు అధికారులు తీసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తుండగా, ఎన్‌ఎంసీ అధికారుల తనిఖీల సమయంలో ఇంతలోనే ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు అనుగుణంగా రోగులు, ఫ్యాకల్టీ, మౌలిక వనరులు ఎలా సమకూరాయో ఎన్‌ఎంసీ అధికారులే చెప్పాలని అంటున్నారు. 

మరో 3 కాలేజీలకు కూడా.. 
రాజ రాజేశ్వరి మెడికల్‌ కాలేజీతో పాటు హైదరాబాద్‌ శివార్లలోని నోవా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్‌ కాలేజీ, సీఎంఆర్‌ మెడికల్‌ కాలేజీలలో ఎన్‌ఎంసీ అధికారులు తనిఖీలు జరిపి, వైద్య విద్యను కొనసాగించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నట్లుగా తేల్చినట్లు తెలిసింది. ఈ మేరకు కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. 

రాష్ట్రానికి చెందిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓవైపు ప్రైవేటు కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతూ, వసతులు లేని కళాశాలలను గుర్తించి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తుంటే.. మరోవైపు ఎన్‌ఎంసీ అధికారులు మాత్రం ఆయా కళాశాలలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తుండడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రాక్ట్రికల్స్‌ కోసం శవాలు కూడా సమకూర్చుకోలేని దుస్థితి
రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో చాలావరకు కాలేజీల్లో విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు అవసరమైన రోగులు లేరు. ప్రాక్టికల్స్‌ కోసం కనీసం శవాలు కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. వార్డుల్లో పడకలు ఉన్నా, ఏ ఒక్క పడక మీద పేషెంట్‌ లేని పరిస్థితిని సాక్షాత్తూ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ నందకుమార్‌ రెడ్డి, డీఎంఈ డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ స్వయంగా చూశారు. 

మరోవైపు హౌస్‌ సర్జన్‌గా సేవలు అందించే విద్యార్థులకు స్టైపెండ్‌ ఇవ్వకపోగా, నాలుగున్నరేళ్ల కోర్సుకు గాను ఐదేళ్ల కాలానికి ఫీజు తీసుకోవడం, ఫేక్‌ ఫింగర్‌ ప్రింట్స్‌తో డాక్టర్ల హాజరు, ప్రాక్టికల్స్‌ కోసం ఫీజులు వసూలు చేయడం వంటి నిర్వాకాలను గుర్తించారు. అయినా ఎన్‌ఎంసీ అధికారులు వీటిని పట్టించుకోకుండా అన్నింటికీ ఆమోదముద్ర వేసి రావడానికి రూ.కోట్లు లంచాలుగా ముట్టడమే కారణమని ప్రభుత్వ వైద్యాధికారులే ఆరోపిస్తున్నారు.  

ఎన్‌ఎంసీ సమావేశాలకు మాజీ అధికారులేంటి? 
నీట్‌ అడ్మిషన్లు, కాలేజీలకు అనుమతులు, రెన్యువల్, మెడికల్‌ కాలేజీలకు రేటింగ్‌ ఇవ్వడం వంటి అంశాలపై చర్చించేందుకు గాను ఎన్‌ఎంసీ నిర్వహించే సమావేశాలకు ఆయా రాష్ట్రాల హెల్త్‌ వర్సిటీల వీసీలను, వర్సిటీల్లో కీలక హోదాల్లో పనిచేసి రిటైర్‌ అయిన వారిని ఆహ్వానిస్తారు. అయితే కాళోజీ నారాయణరావు వర్సిటీ వీసీ నందకుమార్‌ రెడ్డికి బదులుగా మాజీ వీసీ కరుణాకర్‌ రెడ్డిని ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 

బుధవారం ఎన్‌ఎంసీలో జరిగిన సమావేశానికి కూడా నందకుమార్‌ రెడ్డికి ఆహ్వానం వెళ్లలేదని సమాచారం. గతంలో ఎంఏఆర్‌బీ (మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు)లో ఉన్న ఓ అధికారి కాలేజీలకు ర్యాంకుల కేటాయింపులో అవకతకవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ కాగా, సదరు అధికారిని కూడా ఎన్‌ఎంసీ సమావేశాలకు ఆహ్వానిస్తుండడం గమనార్హం. 

ఒడిశాకు చెందిన మరో రిటైర్డ్‌ వీసీ కూడా ఎన్‌ఎంసీలో జరిగే అవకతవకల్లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వసతుల్లేని ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి కోట్లాది రూపాయలు దండుకుంటున్న అధికారులు, వాటికి అనుమతులివ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement