
వరంగల్ ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ షాక్!
ఈ ఏడాది ఎంబీబీఎస్ అడ్మిషన్లకు అనుమతి నిరాకరణ
రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు సీబీఐ కేసుతో చర్యలు
సాక్షి, హైదరాబాద్: రెన్యువల్ కోసం లంచం ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరంగల్‌లోని ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజీ (ఎఫ్‌సీఐఎంఎస్)కి ఈ సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లలో షాక్ తగిలింది. త్వరలో ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ అడ్మిషన్ల జాబితా నుంచి ఈ కళాశాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) తొలగించింది.
ఈ కాలేజీలో ఉన్న 150 ఎంబీబీఎస్ సీట్లను రెన్యువల్ చేయలేదు. దీంతో రాష్ట్రంలో ఈసారి 150 ఎంబీబీఎస్ సీట్లు తగ్గనున్నాయి. వైద్య కళాశాల రెన్యువల్ కోసం రూ.66 లక్షలు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగాసీబీఐ నమోదుచేసిన కేసుల ఆధారంగా మొత్తం 3,000 మెడికల్ సీట్లను ఎన్‌ఎంసీ ఈసారి రెన్యువల్ చేయలేదు. అందులో తెలంగాణ నుంచి ఎఫ్‌సీఐఎంఎస్ ఒక్కటే ఉంది.
రెన్యూవల్ కోసం అడ్డదారులు: ఎఫ్‌సీఐఎంఎస్ 2023లోనే ప్రారంభమైంది. ఈ కళాశాలకు ట్రస్టీగా ఉన్న ఫాదర్ జోసఫ్ కొమ్మారెడ్డి.. కళాశాల రెన్యువల్ కోసం అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది. నకిలీ బోధకులు, అద్దె రోగులతో కళాశాల పరిధిలోని బోధనాసుపత్రిని నింపి అప్పటి అధికారులను మేనేజ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ బి.హరిప్రసాద్ (కదిరి, ఏపీ), డాక్టర్ అంకం రాంబాబు (హైదరాబాద్), డాక్టర్ కృష్ణ కిషోర్ (విశాఖపట్నం) ద్వారా రెండు విడతల్లో రూ.66 లక్షలను ఎంసీఐ అధికారులకు లంచంగా ఇచ్చినట్లు సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.