మానసికంగా..శారీరకంగా వేధిస్తున్నారు!

Doctors Beats Women Patients In Mahabubnagar - Sakshi

సాక్షి, పాలమూరు : ఆపరేషన్‌కు సహకరించడంలేదన్న కారణంతో కొందరు వైద్యులు బూతులు తిడుతూ.. పిడి గుద్దులు గుద్దుతుండడంతో ఆ బాలింతలు నరకం అనుభవిస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కు.ని (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్‌ చేయించుకునే స్థోమత లేకో.. మరే కారణంతోనో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న మహిళల పట్ల దయాగుణంతో వ్యవహరించాల్సిందిపోయి.. ఇక్కడికి ఎందుకు వస్తారని.. ప్రైవేట్‌కు పోవచ్చు కదా అంటూ వైద్యులు దూషిస్తున్నారు. ఇదేమిటని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే..  సర్జరీకి సహకరించడం లేదని సాకులు చెబుతున్నారు. ఈ వ్యవహారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఉన్న పీపీయూనిట్‌లో చోటుచేసుకుంది. 

ఫిర్యాదుతో విషయం వెలుగులోకి..
వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలో పనిచేస్తున్న పీపీయూనిట్‌లో సంతానం వద్దని భావించే మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌(కుని) చేస్తుంటారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న మహిళలు అందరూ ఇక్కడికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకోవడానికి వస్తుంటారు. అయితే ఇక్కడ పనిచేసే మెడికల్‌ ఆఫీసర్లు  డాక్టర్‌ రఫీక్, మరో వైద్యురాలు కలిసి కుని ఆపరేషన్‌ చేసుకోవడానికి వచ్చిన మహిళలు ఆపరేషన్‌కు సహకరించడం లేదని ముఖంపై, ఇతర ప్రాంతాల్లో పిడి గుద్దులు గుద్దడం, రక్కడం వంటివి చేస్తున్నారు. దీంతో పాటు నోటికి వచ్చిన బూతులు తిడుతూవారిని మానసికంగా..శారీరకంగా వేధిస్తున్నారు. ఇంత దారుణం జరుగుతున్నా... ఉన్నత అధికారులు చర్యలు తీసుకోకపోవడం పెద్ద చర్చనీయ అంశంగా మారింది.  పేద మహిళలు..నిరక్షరాస్యులు కావడంతో ఇన్ని రోజుల పాటు విషయం వెలుగులోకి రాలేదు. అయితే బుధవారం అంజలి అనే బాలింతరాలు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారికి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

మొదటి నుంచి ఆరోపణలు
మహబూబ్‌నగర్‌ పీపీయూనిట్‌లో పని చేస్తున్న డాక్టర్‌ రఫీక్‌పై మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఇతను పీపీ యూనిట్‌లో 2011–12ప్రాంతం నుంచి అక్కడే పని చేస్తున్నాడు. చాలా కాలం నుంచి పనిచేయడం వల్ల స్థానికంగా పాతుకుపోయాడు. దీంతో అక్కడ అతను చెప్పిన మాటే వేదంగా మారింది. ఏడాదికి కేటాయించిన లక్ష్యం పూర్తి చేయకపోవడం..సకాలంలో కుని ఆపరేషన్లు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పారిపాటిగా మారింది. అయితే డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌ పనిచేసే సమయంలో ఇతనిని సరెండర్‌ కూడా చేయడం జరిగింది. తిరిగి కొన్ని రోజులకు అక్కడే విధుల్లో చేరాడు. ఆ తర్వాత ఓసారి కలెక్టర్‌ విజిట్‌ చేసిన సమయంలో అతను విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

కర్కశత్వం ఎందుకు?
ఎన్నో పురటి నొప్పులు భరించి శిశువుకు జన్మనిచ్చిన తల్లి శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. అప్పటికే ప్రసవం కోసం ఆపరేషన్‌ చేసుకొని..మళ్లీ పిల్లలు కాకుండా ఉండటానికి మరో ఆపరేషన్‌ చేసుకోవడానికి వస్తోంది. అలాంటి తల్లి శరీరం ఆపరేషన్‌కు సహకరించడానికి కొంత ఇబ్బందిగా ఉన్నా.. సమయం తీసుకొని ఆపరేషన్‌ చేయాలి. అంతే తప్పా మానవత్వం మరిచి దాడి చేయడం సరైన చర్యకాదు. అలా కొడుతున్న సమయంలో ఆ తల్లి ఎంతటి బాధను అనుభవిస్తోందో అంతు చిక్కడం లేదు. 

చాలా కొట్టారు
నేను సోమవారం కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేసుకోవడానికి ఆస్పత్రికి వచ్చి ఆడ్మిట్‌ అయ్యాను. మంగళవారం ఉదయం ఆపరేషన్‌ చేసే సమయంలో డాక్టర్‌ రఫీక్‌ నా దవడపై, ముఖంపై బలంగా కొట్టాడు. తొడ భాగంపై కొట్టడంతో పాటు నడుముని విపరీతంగా మెలిమి తిప్పాడు. దీంతో నాకు పెదవి చిట్లి రక్తం వచ్చింది. అదేసమయంలో చెప్పకూడని బూతులు తిట్టాడు.                 
– అంజలి, చౌదర్‌పల్లి

పొట్ట లోపలికి తీసుకోలేదని కొట్టారు 
నాకు ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో పొట్టను లోపలికి తీసుకోలేదని ఓ మేడం రెండుసార్లు కొట్టారు. 
– రేణుక, మర్లు, మహబూబ్‌నగర్‌ 

ముఖంపై కొట్టడంతో రక్తం వచ్చింది
నాకు ఆపరేషన్‌ చేసే సమయంలో నా ముఖంపై కొట్టడంతో నా పెదవి నుంచి రక్తం రావడం జరిగింది. ఇక్కడికి ఎందుకు వచ్చారు ప్రైవేట్‌ ఆస్పత్రికి పోవద్దా అని..బూతులు తిట్టారు.
– తిరుపతమ్మ

విచారణ చేసి చర్యలు తీసుకుంటాం
మహబూబ్‌నగర్‌ పీపీ యూనిట్‌లో వైద్యులు మహిళలపై దాడులు చేసిన విషయంపై ఫిర్యాదు వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పీపీ యూనిట్‌కు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరిస్తాం. ఆపరేషన్‌ కోసం వచ్చిన వారిపై మాత్రం దాడి చేయడం అనేది సరైన చర్య కాదు.
– డాక్టర్‌ రజిని, డీఎంహెచ్‌ఓ, మహబూబ్‌నగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top