పురిటి నొప్పులతోనే పంపించేస్తున్నారు | Doctor Negligence In Nizamabad | Sakshi
Sakshi News home page

పురిటి నొప్పులతోనే పంపించేస్తున్నారు

Aug 2 2018 3:28 PM | Updated on Aug 2 2018 3:28 PM

Doctor Negligence In Nizamabad - Sakshi

గర్భిణులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తున్న సిబ్బంది.. 

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో పురిటి నొప్పులతో వస్తున్న నిండు గర్భిణులకు వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు లేరని, సరైనా పరీక్షలు లేవని, సీరియస్‌గా ఉందని సాకులు చూపుతూ బలవంతంగా నిజామాబాద్‌ జిల్లాకు సిఫారసు చేస్తున్నారు. దీంతో అరచేతిలో తల్లి శిశువుల ప్రాణాలు పట్టుకుని అంబులెన్స్‌లలో వెళ్తున్నారు.

మార్గమధ్యంలో ఇటీవల చాలా మంది గర్భిణులు ప్రసవాలైన సంఘటనలు ఉన్నాయి. ఇలా కామారెడ్డి జిల్లా కేంద్ర ఏరియా ఆస్పత్రిలో దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. అయితే బుధవారం రోజున ముగ్గురు గర్భిణులను గెంటేశారు. ఒక్క మంగళవారం రోజే ఏడుగురు గర్భిణులను గెంటేశారు. దీంతో గర్భిణులు, వారి బంధువులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సౌకర్యాలు లేవనే సాకుతో.. 

బుధవారం రోజున ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డికి చెందిన సవిత పురిటి నొప్పులతో ప్రసవం కోసం వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఇక్కడ సౌక ర్యాలు లేవని, శిశువు బాగా లేదని, నిజామాబాద్‌కు వెళ్లాలని రిఫర్‌ చేశారు. ఇదే రోజు కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన బోయ సంధ్య అత్తగారైనా సిర్నాపల్లిలో రెగ్యులర్‌గా చూపించుకుంటూ తల్లిగారు ఇక్కడే కావడంతో పురిటి నొప్పులతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి వచ్చింది.

ఇక్కడ రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోలేదని మీ ప్రాంత ఆస్పత్రిలో చూపించుకోవాలని రిఫర్‌ చేసారని సంధ్య తండ్రి భిక్షపతి వాపోయాడు. భిక్కనూరుకు చెందిన ఓ నిండు గర్భిణిని రిఫర్‌ చేశారు. మంగళవారం రోజున గుర్జాల్‌తండాకు చెందిన కవిత, అమర్లబండకు చెందిన స్వప్న, యాచారం తండాకు చెందిన అనితతోపాటు మ రో నలుగురు గర్భిణులను బలవంతంగా నిజా మాబాద్‌కు రిఫర్‌ చేశారు. మంగళవారం గైనిక్‌ డాక్టర్‌ విజయలక్ష్మి విధుల్లో లేక రిఫర్‌లు చేసా మని సిబ్బంది చెప్పుకొచ్చారు.

ఇలా రెండు రోజుల్లోనే 10 మంది గర్భిణులను అకారణంగా వైద్యు లు లేరని, రక్త పరీక్షలు లేవని, రెగ్యులర్‌గా చెకప్‌లు చేయించుకోలేరని, ఇక్కడ సౌకర్యాలు లేవనే వివిధ రకాల కారణాలతో వీరందరిని రిఫర్‌ చేసారని తెలిసింది. జులైలో చాలామంది గర్భిణులను ముఖ్యంగా రాత్రివేళల్లో వస్తున్న వారందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు రిఫర్‌ చేస్తున్నారు.

ఏప్రిల్‌లో ఎల్లారెడ్డి మండలం మీసానిపల్లితండాకు చెందిన వనిత అనే గర్భిణిని రిఫర్‌ చేయడంతో కామారెడ్డి దాటగానే అంబులెన్స్‌లో సాధారణ ప్రసవమైంది. గత నెల 9న రామారెడ్డి మండలం కన్నాపూర్‌కు చెందిన సవిత అనే గర్భిణిని సైతం వైద్యులు లేరని రిఫర్‌ చేయడంతో మార్గమధ్యలో అంబులెన్స్‌లో ప్రసవమైంది. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి.  

వైద్యులుంట లేరు... 

కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్‌ వైద్యురాలు విజయలక్ష్మి మాత్రమే ఉన్నారు. సర్జన్‌లు ఇద్దరు ఉన్నారు. ప్రసవాలను డాక్టర్‌ విజయలక్ష్మి చూసుకుంటారు. ఆపరేషన్‌ అవసరమైతే ఈ ముగ్గురు వైద్యులు చేస్తున్నారు. రోజంతా విధులు నిర్వహిస్తున్న వీరు రాత్రిపూట ఉండక గైనిక్‌ వైద్యులు లేరని గర్భిణులను పంపించేస్తున్నారు. సాధారణ కాన్పులు కాకపోతే ఆపరేషన్‌ అయ్యే అవకాశాలు ఉంటే డాక్టర్‌లు లేరని ఎమర్జెన్సీగా రిఫర్‌లు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో గర్భిణులు నానా అవస్థలు పడుతున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం గర్భిణులు వస్తే మాత్రం సిబ్బంది చూస్తున్నారు.  

పట్టించుకోని అధికారులు 

జిల్లా కేంద్ర ఆస్పత్రులో వైద్యులు లేక గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఘటనలు జరిగినప్పుడు ఇతర ఆస్పత్రుల నుంచి వైద్యులను డిప్యూటేషన్‌ వేసి మరిచిపోతున్నారు. వారు వెళ్లి పోగానే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. నూత నంగా వస్తున్న మహిళా వైద్యులు ప్రసవాలు, సీజరియన్‌లు చేయడం లేదు. కేవలం ఓపీ చూస్తున్నారు. దీంతో పురిటి నొప్పులతో వస్తున్న గర్భిణులు నరకం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

ఇక్కడ సౌకర్యాలు లేవంటున్నరు 

నేను పురిటి నొప్పులతో వస్తే గంటసేపు పరీక్ష చేసి ఇక్కడ సౌకర్యాలు లేవు అని పంపిచేశారు. లోపల దారుణంగా మాట్లాడుతున్నారు. అసలు ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇదేంటని అడిగితే తిడుతున్నారు. మేం రెగ్యులర్‌గా ఎల్లారెడ్డిలో చూపించుకున్నామని ఇక్కడ చెకప్‌లు లేదని పంపిచేస్తున్నారు.       -బోయ సంధ్య, గర్భిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement