కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు.
అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, దుంపటి విజయ్, వినయ్ ఇద్దరు కవల సోదరులు. వీరి పోలికలు అచ్చం ఒకేలా ఉంటాయి. వీరి కోసం సంబంధాలు వెతుకుతున్న క్రమంలో తాడ్వాయి మండలం దేమి కలాన్ గ్రామానికి చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే కవల సోదరీమణుల గురించి తెలిసింది.
రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్-కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.


