‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చెరువుల....
సాక్షి, సంగారెడ్డి: ‘మిషన్ కాకతీయ’ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు పక్కాగా సాగాలని, నాణ్యతలో రాజీపడవద్దని ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్ నుంచి చెరువుల మరమ్మతు పనులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. వాస్తవానికి ఈ సమావేశాన్ని మంత్రి హరీష్‌రావు నిర్వహించాల్సి ఉన్నా, అసెంబ్లీ సమావేశాలున్నందున ఆయన కార్యక్రమానికి రాలేకపోయారు.
దీంతో ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ మురళీధర్‌రావు జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో మొదటి దశలో ఎన్ని చెరువుల మరమ్మతు పనులు చేపడుతున్నా రు, సర్వే ఎలా సాగుతోం ది?, ప్రతిపాదనల రూపకల్పన తదితర వివరాలను ఎస్‌ఈ సురేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మొదటి దశలో ఎంపిక చేసిన 1,580 చెరువుల మరమ్మతు పనులకు టెండర్లు సత్వరం పూర్తి చేసి డిసెంబర్‌లోగా పనులు ప్రారంభించాలని సూచించారు.
త్వరలో కేంద్ర ప్రభుత్వం సాయంతో మూడవ దశలో చెరువుల మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. మార్చిలోగా మూడవ దశ చెరువు మరమ్మతు పనులను సైతం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇరిగేషన్ అధికారులకు మురళీధర్‌రావు సూచించారు. సమావేశంలో పాల్గొన్న ఎస్‌ఈ సురేందర్ మాట్లాడుతూ, జిల్లాలో 1,580 చెరువుల మరమ్మతు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 300 చెరువుల సర్వే పూర్తి కావటంతోపాటు 150పైగా చెరువుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
త్వరలో అన్ని చెరువుల ప్రతిపాదనలు పూర్తి చేసి టెండర్లు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నిర్దేశించినడిసెంబర్ మాసంలో చెరువుల మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఈలు, డీఈఓలు పాల్గొన్నారు. చెరువుల మరమ్మతు పనులకు సంబంధించి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుతో త్వరలోనే సమావే శం నిర్వహించనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.