16 మంది సీఎంలు చేయనిది.. కేసీఆర్‌ చేశారు: డీకే అరుణ

DK Aruna fires on Cm KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 16 మంది సీఎంలు చెయ్యని అప్పు, అంతకు రెండింతలు ఒక్క సీఎం కేసీఆర్‌ చేశారని మాజీ మంత్రి డీకే అరుణ నిప్పులు చెరిగారు. రూ. 69వేల కోట్ల అప్పును 2 లక్షల 21 వేల కోట్ల అప్పుగా చేశారన్నారు. ఇదేనా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన ప్రగతి అంటూ డీకే అరుణ మండిపడ్డారు. పదే పదే టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుస్తుందని కేసీఆర్‌ చెబుతున్నారని, మరోసారి కూడా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని తెలిసినప్పుడు అధికారదుర్వినియోగానికి పాల్పడుతూ 25 లక్షల మందితో సభ ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. మీ ప్రభుత్వం మీద మీకు ఆత్మవిశ్వాసం లేదు, అందుకే జనం అంతా మీ వెంట ఉన్నారని చూపెట్టడానికే సభలు పెట్టి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌ మీద ప్రజలకు విశ్వాసం లేదు కాబట్టే, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని అరుణ తెలిపారు. ప్రగతి నివేదన సభకు దాదాపు రూ.300 కోట్లను సభకు ఖర్చుపెడుతున్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి లేదు అన్నారు కదా, మరీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించారు. లేజిస్లేచర్ పార్టీ మీటింగ్‌లో మీరిచ్చిన డబ్బాలో డబ్బులు పెట్టి పంపారని చర్చ జరుగుతోందన్నారు. సభలకు వచ్చే జనాలకు కూలి ఇచ్చే సంప్రదాయం టీఆర్‌ఎస్‌ ప్రారంభించిందని మండిపడ్డారు. ట్రాక్టర్లకే 50 కోట్ల ఖర్చు అవుతుందని, అన్నింటినీ కలిపితే దాదాపు 280 నుండి 300 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

టీఆర్‌ఎస్‌ ఓడిపోతుందని చెప్పడానికి ప్రగతి నివేదన సభనే నిదర్శనమని డీకే ఆరుణ అన్నారు. మీ అధికార బలంతో మళ్లీ అధికారంలోకి వస్తామని కలలు గంటే అది కలగానే మిగిలిపోతుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయమన్నారు. మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రైతు బంధు పేరుతో ప్రజా ధనం పెట్టి ఓట్లు కొనే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సభను పెట్టడం తప్పు కాదు, అధికార దుర్వినియోగం చేయడాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఎంత తరలించినా వచ్చేది కేవలం ఆ పార్టీ కార్యకర్తలే అని తెలిపారు. అధికారంలో ఉంటే అంతా పచ్చగానే కనిపిస్తుందన్నారు. ప్రగతి నివేదిక ప్రగతి భవన్‌కే పరిమితమయ్యిందని, ప్రజలకు ప్రగతి అందలేదు అంటూ మండిపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top