ఆస్పత్రులు కిటకిట వ్యాధుల విజృంభణ

‘సీజనల్‌’తో క్యూకడుతున్న రోగులు మంచాలు లేక నేలపై పడుకోబెట్టి చికిత్స ఒక్క సెలైన్‌ స్టాండ్‌ను ముగ్గురికి ఉపయోగిస్తున్న వైనం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పేషంట్లు ఫుల్‌ ∙సౌకర్యాలు మాత్రం అంతంతే..

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు పంజావిసుతున్నాయి. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు పక్షం రోజులుగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. వర్షాలు కురుస్తుండడంతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రతి ఇంటికీ ఒకరు చొప్పునవ్యాధుల బారిన పడుతున్నారు. వీటితో పాటు మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధుల లక్షణాలతో పలు ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సీజనల్‌ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెపుతున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి.  

నల్లగొండ టౌన్‌ :
జిల్లాలోని పలు ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న రెఫరల్‌ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డు, ప్లేట్‌లెట్‌లను ఎక్కించే సౌకర్యం ఉండడంతో పాటు స్పెషలిస్టు డాక్టర్లు ఉండడం వలన ఇన్‌పేషంట్, అవుట్‌పేషంట్ల సంఖ్య బాగా పెరిగింది.

నేలపైనే రోగులకు చికిత్స
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో 250 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ   పెరుగుతున్న రోగులకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. దీంతో నేలపైనే పడుకొబెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రతి రోజు అత్యవసర వైద్యసేవలతో పాటు సీజనల్, మలేరియా, డెంగీ స్వైన్‌ఫ్లూ, వ్యాధుల లక్షణాలతో జిల్లా ఆస్పత్రికి ఇన్‌పేషంట్లు వంద మంది, ఇవుట్‌పేషంట్లు సుమారు ఐదు వందల మంది  దాకా   వస్తున్నారు. రోగుల తాకిడి కారణంగా స్త్రీ, పురుష, మెడికల్‌ వారుల్డు, ఐసోలేషన్, జనరల్‌ వార్డులు పూర్తిగా నిండిపోయాయి. చేసేది లేక నేలపేనే చాపలను పరిచి వాటిపై పడుకోబెట్టి వైద్య సేవలు అందించాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. సెలెన్‌ ఎక్కించే స్టాండ్‌లు సైతం సరిపోక ఒక్కో స్టాండ్‌కు ముగ్గురికి ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కిటికీలకు కట్టి కూడా సెలెన్‌ ఎక్కిస్తుండడం ప్రస్తుతం నిత్యకృత్యమైంది.

అదనపు బ్లాక్‌ను ప్రారంభిస్తే..
జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి అదనంగా 150 పడకల సామర్థ్యం కలిగిన అదనపు బ్లాక్‌ను రూ.4 కోట్లతో ని ర్మించారు. అయితే నిర్మాణం పూర్తయై నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఇదే బ్లాక్‌ ప్రారంభించి ఉంటే సీజన్‌ల్‌ వ్యాధులతో వచ్చే రోగులకు తిప్పలు తప్పేవి. అదే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉండేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా జిల్లా మంత్రి స్పందించి వెంటనే ఆదనపు బ్లాక్‌ను ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఆగస్టు నుంచి నమోదైన కేసులు ఇలా..
జిల్లాలో సీజన్‌ ప్రారంభమైన ఆగస్టు నుంచి డెంగీ 2, స్వైన్‌ఫ్లూ 3, మలేరియా 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ అనధికారికంగా డెంగీ 20, స్వైన్‌ఫ్లూ 6, మలేరియా 18 కేసులు నమోదైనట్లు సమాచారం. అయితే వారందరూ వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జి అయినట్లు, మరణాలు మాత్రం జరగలేదని తెలిసింది.

‘మిర్యాల’లో స్వైన్‌ ఫ్లూ కలకలం
మిర్యాలగూడ : మిర్యాలగూడలో స్వైన్‌ఫ్లూ కలకలం రేపుతోంది. మిర్యాలగూడలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి ఇటీవల జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లగా స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నాయని చికిత్స నిర్వహించారు. ఆయనకు ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. అదే విధంగా మిర్యాలగూడలోని డాక్టర్స్‌ కాలనీలో జ్వరాలతో వచ్చిన రోగులకు సుమారుగా పది మందికి కూడా డెంగీ లక్షణాలు ఉండటం వల్ల హైదరాబాద్‌లకు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు మాత్రం ప్రతి కాలనీలో ఉన్నాయి. మిర్యాలగూడ పట్టణంలో ఎక్కువగా సుందర్‌నగర్, బంగారుగడ్డ, ఇస్లాంపుర, సీతారాంపురం, ప్రకాశ్‌నగర్, రాంనగర్, తాళ్లగడ్డ ప్రాంతాలలో ప్రజలు ఎక్కువగా జ్వరాల భారిన పడుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top