మట్టిస్నానం.. రోగాలు దూరం!

Diseases Away with The Mud Bath! - Sakshi

సిరాల గ్రామంలో మడ్‌బాత్‌

మట్టి పూసుకుని యోగాసనాలు

పాల్గొన్న వందలాది మంది

భైంసా(ముథోల్‌) ఆదిలాబాద్‌ : మట్టిస్నానానికి అనూహ్య స్పందన లభించింది. భైంసాలోని రాజీవ్‌నగర్‌లో ప్రారంభమైన యోగా శిబిరంలో ప్రతీనెల ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్వాహకుడు ఆడెపు శ్రీనివాస్‌ ఈ ఆదివారం మట్టితో (మడ్‌బాత్‌) స్నానాలు చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. భైంసా డివిజన్‌ వ్యాప్తంగా వందలాదిగా తరలివచ్చి మడ్‌బాత్‌లో పాల్గొన్నారు. ఉదయం 7నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. 

మిశ్రమం తయారీ ఇలా..

భైంసా మండలం సిరాల గ్రామంలోని మహాదేవుని మందిరం వద్ద ఈ వేదిక ఏర్పాటు చేశారు. చుట్టూ రాళ్లగుట్ట, పక్కన చెరువు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న ఈ ప్రదేశంలో మడ్‌బాత్‌ కోసం ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు చేశారు. నల్లమట్టి, ఎర్రమట్టి, బంకమట్టి, పుట్టమట్టి తీసుకువచ్చి ఆరు గంటలపాటు గోమూత్రంలో నానబెట్టారు.

అందులో మూడు రకాల పసుపు, అన్ని రకాల పండ్ల తొక్కల చూర్ణం, తీపుతీగ, వేపాకు, నీలగిరి ఆకు, వావిలి ఆకు, కలబంద, మాంజిష్ట, నేలవేము, కానుగ, మునగ ఆకు, సీతాఫలం ఆకులు రంగరించి నానబెట్టిన మట్టిలో కలిపారు. చందనం, ముల్తానిమట్టి వేసి కొంత నీరుపోసి మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి ఉంచారు. ఈ మిశ్రమాన్ని మడ్‌బాత్‌లో పాల్గొన్నవారందరికీ అందించారు. 

శరీరానికి మట్టి పట్టించి..

మడ్‌బాత్‌లో పాల్గొన్నవారందరికీ ముందుగా స్నానాలు చేయించారు. స్నానాల అనంతరం కలిపిన మట్టి మిశ్రమాన్ని తలపై నుంచి కాలిగోటి వరకు శరీరంపై పట్టించారు. నీడపట్టున మట్టి ఆరిన తర్వాత ఎండలోకి తీసుకువెళ్లారు. శరీరంపై ఉన్న మట్టి ఆరిన తర్వాత యోగాసనాలు వేయించారు. ఆయా రకాల ఆసనాలతో తలనొప్పి, మైగ్రేన్, చర్మవ్యాధులు, నరాల బలహీనత, కండరాలు, కీళ్లనొప్పులు, నడుము, మోకాళ్లనొప్పి, బద్దకం, నిద్రలేమి, మానసిక రుగ్మతులు దూరం కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  

ఆరోగ్య సూత్రాలు వివరించి..

మూడు గంటల తర్వాత అక్కడే స్నానాలు చేయించారు. స్నానాలు చేయించాక ఆరోగ్యానికి ఉపయోగపడే చిట్కాలు తెలిపారు. మడ్‌బాత్‌తో చేకూరే లాభాలను వివరించారు. నేడు కలుషితమవుతున్న వాతావరణం, రసాయనాలతో తయారైన ఆహార పదార్థాలను తీసుకుంటూ శరీరంలో పెరుగుతున్న వ్యాధులను ఎలా అరికట్టాలో సూచించారు. యువకులు, రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

రోజురోజుకు పంటపొలాల్లోనూ రసాయన ఎరువుల వాడకం పెరుగుతుందని, దీంతో తీసుకునే ఆహారం విషమయమై ఉంటుందన్నారు. తీసుకునే ఆహారం ఆర్గానిక్‌ విధానంలో పండించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఆర్గానిక్‌ విధానంలో కాయగూరలు పండించుకోవాలని సూచించారు.

నాలుగు, ఐదు మట్టి కుండలు తీసుకుని అందులో ఆర్గానిక్‌ పద్ధతిలో కూరగాయలను సాగుచేస్తే ఆ కుటుంబం తీసుకునే ఆహారంలో విషతుల్యమైన పదార్థాలు ఉండవని నిర్వాహకులు సూచించారు. ఈ విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించాలని తెలిపారు. ఆర్గానిక్‌ విధానంలో ఇంట్లోనే కూరగాయలు పండించి తినేలా అందరితో సంకల్పం చేయించారు.

 వ్యాధులు దూరమవుతాయి

మడ్‌బాత్‌తో చర్మసంబంధ వ్యాధులన్నీ పూర్తి గా దూరమవుతాయి. ప్రతీ ఆరు నెలలకోసారైనా మడ్‌బాత్‌ చేయాలి. సిరాల గ్రామంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వందలాది మం ది యువకులు రావడం ఉత్సాహాన్నిచ్చింది. ఇక్కడికి వచ్చిన వారు కూడా మడ్‌బాత్‌ ప్ర యోజనాలను పక్కవారికి తెలియజేయాలి. ప్రతీరోజు క్రమం తప్పకుండా యోగాసనా లు వేయిస్తూ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఆర్గానిక్‌ పద్ధతిలో పండించిన కూరగాయలు తింటే ఎలాంటి ఇబ్బందులు రావు. – సిద్ది రాములు, యోగా గురువు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top