పోస్టింగ్‌లలో మాకు అన్యాయం

Disappointments have begun on postings of IAS officers - Sakshi

     ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల నారాజ్‌

     ఓ హోటల్‌లో కలిసి చర్చలు

     సీఎంకు, సీఎస్‌కు వివరించాలని నిర్ణయం    

సాక్షి, హైదరాబాద్‌: ఐఏఎస్‌ అధికారుల పోస్టింగ్‌లపై అసంతృప్తులు మొదలయ్యాయి. పోస్టింగ్‌ల కేటాయింపులో ప్రభుత్వ ప్రస్తుత విధానంపై ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన ఐఏఎస్‌ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రాధాన్యత పోస్టుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని దళిత, గిరిజన వర్గాల ఐఏఎస్‌లు మండిపడుతున్నారు. ఈ మేరకు పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆదివారం సమావేశమై ప్రభుత్వం ఈ విషయంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించే విధానాన్ని రూపొందించాలంటూ కోరాలని నిర్ణయించారు. మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఈ విషయంపై వివరించాలని అనుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను కలవాలని నిర్ణయించారు. 

జూనియర్లకే పోస్టింగ్‌లా...? 
విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోస్టింగ్‌ల కేటాయింపులో దళిత, గిరిజన ఐఏఎస్‌ అధికారులకు అన్యాయం జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం కేటాయించాల్సిన పోస్టులను సైతం ఎస్సీ, ఎస్టీ సీనియర్‌ ఐఏఎస్‌లను కాకుండా ఇతర వర్గాలకు చెందిన జూనియర్‌ ఐఏఎస్‌లకు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఉద్దేశపూర్వకంగానే అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. జిల్లాల పునర్విభజనతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి పెరిగింది. దీంతో కలెక్టర్ల పోస్టుల సంఖ్య కూడా పెరిగింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇవ్వడంలేదు. అగ్రవర్ణాలకు చెందిన జూనియర్‌ ఐఏఎస్‌లకు జిల్లాల కలెక్టర్లుగా పోస్టింగ్‌ ఇస్తున్నారు. కలెక్టర్‌గా పని చేయాలని ప్రతి ఐఏఎస్‌ అధికారి లక్ష్యంగా ఉంటుంది. ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఈ అవకాశం కల్పించడం లేదు. ఒకటి, రెండు జిల్లాల వారికే ఈ అవకాశం కల్పించారు.

రిటైర్డ్‌ ఉన్నతాధికారి, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ప్రభావం వల్లే ఇలా జరుగుతోంది. చిన్నచిన్న తప్పులను సీఎం కేసీఆర్‌కు పెద్దగా చేసి చూపి పోస్టింగ్‌ ఇవ్వకుండా చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు కీలక విభాగాలను కేటాయించడంలేదు. సీనియారిటీని పట్టించుకోవడంలేదు. ఎక్స్‌ కేడర్‌ పోస్టులను కొత్తగా సృష్టించి మరీ ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లకు అప్రాధాన్య పోస్టులు ఇస్తున్నారు. ఉన్నతస్థాయి పోస్టుల్లో నియమించాల్సిన సీనియర్‌ అధికారులను అప్రాధాన్య పోస్టులలో ఏళ్లపాటు కొనసాగిస్తున్నారు.

కొందరు బీసీ ఐఏఎస్‌ అధికారులకూ అన్యా యం జరుగుతోంది. అగ్రవర్ణాలకు చెందిన కొందరిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నా వారికి ప్రాధాన్యత పోస్టులలో అవకాశం ఇస్తున్నారు. నాన్‌ ఐఏఎస్‌ అధికారులను ఐఏఎస్‌ల పోస్టులలో నియమిస్తున్నారు. పదవీ విరమణ పొందినా కొందరికి ప్రాధాన్యత కలిగిన ఐఏఎస్‌ల పోస్టులు ఇస్తున్నారు. ఇలాంటి పరిణామాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఐఏఎస్‌ అధికారులలో మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. అందుకే కొందరు ఇతర రాష్ట్రాలు, కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికైనా పరిస్థితి మారాలి. దీని కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని కలసి వివరిద్దాం. అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించాలి’అని సమావేశంలో ఐఏఎస్‌లు నిర్ణయించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top