కలర్‌ఫుల్‌.. ‘మాస్క్‌’

Demand in Market on Hand Made Masks Hyderabad - Sakshi

కుత్బుల్లాపూర్‌:  కోవిడ్‌–19 ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల పరిశ్రమలు కుదేలవుతున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మన దగ్గర కరోనా పాజిటివ్‌ కేసులు అప్పుడప్పుడే కనిపిస్తున్న నాటి నుంచి ఒక్కో పరిశ్రమ ఉత్పత్తులు క్రమక్రమంగా తగ్గిపోతూ కొన్ని పూర్తిగానూ మరికొన్ని పాక్షికంగానూ దెబ్బతిన్నాయి. కరోనా ప్రభావంతో పరిశ్రమలు, వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయిన సందర్భంలో అప్పటి వరకు అంతగా డిమాండ్‌ లేని ఉత్పత్తులైన మాస్క్‌లు, గ్లౌజ్‌ల తయారీ ఇతర శరీర రక్షణ పరికరాల ఉత్పత్తుల పరిశ్రమలకు డిమాండ్‌ పెరిగింది. ఇందులో ముఖ్యంగా ‘మాస్క్‌’ ఉత్పత్తుల రంగం ఊపందుకుంది.

నిన్నటి వరకు సర్జికల్‌.. ఎన్‌–95లు.. నేడు..?
కోవిడ్‌– 19కు ముందు మాస్క్‌లు వేసుకునే వారే లేరు. తీవ్రంగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, ఔషధ, కెమికల్‌ పరిశ్రమల్లో పనిచేసేవారు, పొల్యూషన్‌ పట్ల పూర్తి అవగాహన ఉన్నవారితో పాటుగా కొన్ని సందర్భాల్లో డాక్టర్లు, నర్సులు సర్జికల్‌ మాస్క్‌లు, ఎన్‌–95 మాస్క్‌లను ధరించేవారు. క్రమక్రమంగా కోవిడ్‌–19 ప్రభావం చూపిస్తున్న తరుణంలో నిన్నటి వరకు అందుబాటులో ఉన్న సర్జికల్, ఎన్‌–95 మాస్క్‌ల స్థానంలో కాటన్‌ గుడ్డలతో చేసిన మాస్క్‌లకు సైతం మంచి డిమాండ్‌ వచ్చింది.  (ఫేస్‌మాస్క్‌ల గురించి మనకు ఏం తెలుసు?)

విభిన్నంగా తయారీలో.. 

నిన్నటి వరకు సర్జికల్‌ లేదా ఎన్‌–95 తరహా మాస్క్‌లు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు విభిన్నమైన మాస్క్‌లు తయారు చేసి అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్‌ అనంతరం కూడా మాస్క్‌లకు డిమాండ్‌ ఉంటుందనేది స్పష్టమవుతున్న సందర్భంలో ఇప్పుడుమాస్క్‌ల తయారీతో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు తమ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. వంద శాతం శానిటైజ్డ్, 100 శాతం కాటన్, ఇకో ఫ్రెండ్లీ నినాదాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. 

కస్టమైజ్డ్‌.. ఎంబ్రయిడరీ మాస్క్‌లు.. 
మాస్క్‌ల తయారీ రంగం ఊపందుకోవడంతో కుటీర పరిశ్రమలుగా రూపాంతరం చెందుతున్నాయి. ఎవరికి వారు విభిన్నంగా మాస్క్‌లను అందంగా, ఆకర్షణీయంగా రూపొందించేందుకు పోటీ పడుతున్నారు. పూర్తి రక్షణతో, అన్ని రకాల వయసు వారికి రకరకాల రంగులు– డిజైన్లతో కాంబో ప్యాక్‌లతో మార్కెట్‌లో ఉంచుతున్నారు. సాధారణంగా కాటన్‌ గుడ్డతో చేసిన మాస్క్‌ రూ.20 నుంచి రూ.40 వరకు ఉండగా వివిధ రకాల ప్యాటర్న్‌లు అయిన కలంకారీ– రూ.70, ఇకాట్‌– రూ.70, లెనిన్‌ ప్లేయిన్‌– రూ.85, కస్టమైజ్డ్‌ ఎంబ్రయిడరీ డిజైన్‌ మాస్క్‌లు– రూ.100, కిడ్స్‌ కార్టున్‌ బొమ్మలు ఉన్న మాస్క్‌ రూ.120లుగా విక్రయిస్తున్నారు. స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్‌ట్రా లార్జ్‌ సైజ్‌లలో ఇవి లభ్యమవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top