జవాబుదారీతనం పెరిగింది

DCP KS Raghuveer Speech in 30 Years Complete Ceremony - Sakshi

పాతికేళ్లలో లేనివి ఐదేళ్లల్లో!

అప్పట్లో పోలీసింగ్‌ అంటే అత్యంత కష్టం

ఇప్పుడు ఉన్న సదుపాయాలు అప్పుడు లేవు

‘సాక్షి’తో సైబర్‌ క్రైమ్‌ అదనపు డీసీపీ రఘువీర్‌

30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 89 బ్యాచ్‌ అధికారి

సాక్షి, సిటీబ్యూరో: ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తొలిసారిగా 1988లో సబ్‌–ఇన్‌స్పెక్టర్లను ఎంపిక చేసింది. ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న దాదాపు 400 మంది ఎస్సైలు 1989 బ్యాచ్‌ అధికారులుగా ఆ ఏడాది జనవరి 16న పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రస్తుతం అదనపు డీసీపీ స్థాయిలో ఉన్న వారు సిటీలో తొమ్మిది మంది ఉన్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న అదనపు డీసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ వారిలో ఒకరు. ఈ మూడు దశాబ్ధాల ప్రయాణంలో తాను గమనించిన మార్పుచేర్పులను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలివీ...

‘యూనిఫాం’ కోసమే..
చిన్నప్పటి నుంచి క్రీడలు, సమకాలీన అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపించే రఘువీర్‌ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని బలగాలు, సంస్థల్లో ఉద్యోగంలో చేరాల్సిన వారే. ఆయన తండ్రి భారత వాయుసేనలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశారు. తన ముగ్గురు కుమారులను ఎయిర్‌ఫోర్స్‌లో చేర్చి దేశానికి సేవ చేయించాలన్నది ఆయన ఆశయం. మిగిలిన ఇద్దరూ అదే మార్గంలో వెళ్లినా... ఓ చిత్రమైన ఘటన రఘువీర్‌కు ఎయిర్‌ఫోర్స్‌ను దూరం చేసింది. ఎన్‌సీసీలో కీలకంగా వ్యవహరించిన ఆయన 80వ దశకంలోనే వాయుసేన సెలక్షన్స్‌కు వెళ్లారు. బెంగళూరులోని ఎలహంక బేస్‌లో సాగుతున్న ఈ ప్రక్రియకు ఆ బ్యాచ్‌లో రఘువీర్‌తో పాటు మరో తొమ్మిది మంది హాజరయ్యారు. ఎంపిక దాదాపు పూర్తయిన సం దర్భం లో ఓ అభ్యర్థి పర్సు చోరీకి గురైంది. ఈ దొంగ తనం చేసింది ఎవరో తేల్చలేకపోయిన సెలక్షన్‌ అధికారులు మొత్తం 10 మందినీ వెనక్కు పంపే శారు. ఆపై రైల్వేలో స్టేషన్‌ మాస్టర్‌గా ఉద్యోగం వచ్చినా... తండ్రి మాట ప్రకారం యూనిఫాం కోసం కష్టపడి ఎస్సైగా ఎంపికయ్యారు.

అప్పట్లో అకాడమీ లేదు...
ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులకు పోలీసు అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. అయితే 1998లో పోలీసు అకాడమీ నిర్మాణంలో ఉంది. దీంతో ఈ బ్యాచ్‌కు చెందిన 400 మందికీ అనంతపురం, అంబర్‌పేటల్లోని పోలీసు ట్రైనింగ్‌ కాలేజీల్లో శిక్షణ ఇచ్చారు. ఓ ప్రాంతం వారిని మరో ప్రాంతానికి మార్చి దీనిని పూర్తి చేశారు. ఎస్సై అభ్యర్థులకు శిక్షణలో రూ.250, ప్రొబేషనరీలో రూ.800 వరకు, డిక్లేర్‌ అయిన తర్వాత రూ.1500 మాత్రమే జీతభత్యాలుగా చెల్లించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన పెంపుతో ఇవన్నీ వేలు దాటి లక్షలకు చేరిపోయాయి. అప్పట్లోనే కాదు నాలుగైదేళ్ల క్రితం వరకు పోలీసుస్టేషన్లలో సరైన సదుపాయాలు ఉండేవి కాదు. గోడలకు రంగులు, పైకప్పులకు హంగులే కాదు... కూర్చోడానికి కుర్చీలు, టేబుళ్లు సైతం కరువే. అయితే ప్రస్తుతం వీటితో పాటు స్టేషనరీ సైతం ప్రతి స్థాయి అధికారికీ వచ్చి చేరుతోంది. అన్ని స్థాయిల వారికీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. 

జవాబుదారీతనం పెరిగింది...
ఒకప్పుడు ఫిర్యాదుదారుల్లో ఇప్పటి స్థాయి అవగాహన ఉండేది కాదు. అప్పట్లో ఎవరైనా కంప్‌లైట్‌ ఇచ్చిన తర్వాత మళ్లీ వచ్చి దాని విషయం ఆరా తీయడానికి ఆలోచించేవారు. ప్రతి ఒక్కరూ కాకపోయినా చాలా అంశాల్లో పరిస్థితి ఇలానే ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజల్లో చట్టం పట్ల, పోలీసుల పనితీరుపట్ల పెరిగిన అవగాహనతో పోలీసుల్లో జవాబుదారీతనం వచ్చింది. ఒకప్పుడు ఉన్నతాధికారులు కింది స్థాయి వారితో ప్రవర్తించే తీరుకు, ఇప్పటి పరిస్థితులకు అసలు సంబంధం లేదు. నేరాలు నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడం అప్పట్లో శక్తికి మించిన పనులుగా ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, సదుపాయాలు, క్రైమ్‌ ల్యాబ్స్‌... వంటి వాటి వల్ల ఇప్పుడు ఈ రెండిటితో పాటు నేరాలు నిరోధించడమూ తేలికగా మారింది. ఇప్పుడు ఎన్ని రకాల నేరాలు ఉన్నా.. సైబర్‌ క్రైమ్స్‌ మాత్రం నానాటికీ పెరిగిపోతున్నాయి. భవిష్యత్తులో ఇవే ప్రజలు, పోలీసులకు పెను సవాల్‌గా మారే ప్రమాదం పొంచి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top