చేతికి సారథి ఎవరో?

DCC  President Post For Politics In Rangareddy - Sakshi

త్వరలో ఏఐసీసీ కొత్త జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమించనుంది. ఇందుకు పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కొత్త జిల్లాలకు సైతం ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పునర్విభజనలో భాగంగా వికారాబాద్‌ జిల్లా 2016 అక్టోబరు 11న ఏర్పడింది. అప్పట్లో కొత్త జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులను నియమిస్తారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే, త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై అధిష్టానం  దృష్టిసారించినట్లు తెలుస్తోంది. జిల్లా డీసీసీ పీఠాన్ని దక్కించుకునేందుకు పలువురు నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  

సాక్షి, వికారాబాద్‌: కొత్త జిల్లాలకు డీసీసీ ఉంటే పార్టీ మరింత బలోపేతమై కార్యకర్తల్లో నూతనోత్తేజం రానుందని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈవిషయంలో దృష్టిసారించాలని పలుమార్లు టీపీసీసీ జాతీయ నాయకత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇది కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఏ కారణం చేతనో ఆగిపోయింది. దీంతో పార్టీ వ్యవహారాలను ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించడం లేదని, పార్టీ బలోపేతానికి కార్యక్రమాలు నిర్వహించడం లేదని కాంగ్రెస్‌ నాయకులు బాహాటంగానే విమ ర్శిస్తున్నారు. కొత్తగా డీసీసీని నియమిస్తే పార్టీ క్షేత్రస్థాయిలో బలపడుతుందని జిల్లాకు చెందిన నేతలు అభిప్రాయపడుతున్నారు.

తమ ప్రయత్నాల్లో ఆశావహులు   
డీసీసీ (జిల్లా కాంగ్రెస్‌ కమిటీ)సారథ్య బాధ్యతలనునిర్వర్తించేందుకు పలువురు నేతలు ఉత్సాహం చూపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను నియమిస్తున్నట్లు ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మళ్లీ ఉమ్మడి రంగారెడ్డి అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌నే కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే టీపీసీసీ ప్రతిపాదనలకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పచ్చజెండా ఊపడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మూడు రోజుల క్రితం ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాంరమేష్‌ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

డీసీసీ విషయంలోనే ఆయన తనను కలిసినట్లు జిల్లాలో ప్రచారం కూడా జరుగుతోంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ పోస్టుకు ప్రాధాన్యం పెరిగిందని చెప్పవచ్చు. టికెట్ల కేటాయింపులో పార్టీ జిల్లా అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకోవడం, బీ ఫారాల పంపిణీ బాధ్యత వారిదే కావడం, ఎన్నికల ప్రచారంలో కీలకపాత్ర పోషించే అవకాశం ఉండడంతో ఎలాగైనా డీసీసీ పదవిని దక్కించుకోవాలని ఆశావహులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌తో పాటుగా మరో మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి తదితరులు పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, అధిష్టానం ఎవరిపైన కరుణ చూపిస్తుందోనని కార్యకర్తలు, నాయకులు ఎదురుచూస్తున్నారు.
 
విభేదాలు అంతరిస్తాయా..?  
జిల్లా ఏర్పడి రెండేళ్లు కావొస్తుండడంతో కాంగ్రెస్‌కు జవసత్త్వాలు రావాలంటే ప్రత్యేక కార్యవర్గం ఉండాల్సిందేనని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌ జిల్లా ఏర్పడిన రెండేళ్లలో ఎప్పుడూ జిల్లాలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఆయన కొంతమంది నాయకులకే వత్తాసు పలుకుతూ మరికొందరిని నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు ఉంది. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని కొందరు నేతలు వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకుల్లో చిచ్చుపెడుతూ విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించాలనే అధిష్టానం నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.
  
బరిలో ఆశావహులు 
డీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కుతాయోననే విషయంలో పలువురు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈనెల 13, 14 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన ఉందని, దానిని సక్సెస్‌ చేసే పనిలో ఉన్నామని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమం అనంతరం ఈ విషయమై పార్టీ నాయకులమంతా కూర్చొని నిర్ణయిస్తామని అన్నారు. ‘డీసీసీ’ విషయమై ఇంకా చర్చ జరగలేదని, త్వరలో తేలిపోతుందని చెప్పారు. ఇదే విషయమై మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తానని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారుగా అని అడుగగా.. తప్పకుండా ఉంటాను. అధిష్టానం తనను  నియమిస్తే క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. దీంతోపాటు డీసీసీబీ మాజీ చైర్మన్‌ లక్ష్మారెడ్డి సైతం బరిలో ఉన్నారు. తను కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించాలనే పార్టీ నిర్ణయాన్ని అందరు నేతలు స్వాగతించారు.
 
స్థల కేటాయింపునకు.. 
గుర్తింపు పొందిన పార్టీలకు ప్రభుత్వం నామమాత్రపు ధరకే పార్టీ ఆఫీసుల నిర్మాణాలకు జిల్లా కేంద్రాల్లో భవనాలు నిర్మించుకునేందుకు స్థలాలను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయా జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలు నిబంధనల ప్రకారం (బైలాస్‌) ఉంటేనే దరఖాస్తు చేసుకునే వీలుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులే కొత్త జిల్లాలకు సారథులుగా కొనసాగుతున్నారు. సర్కారు నుంచి స్థలం తీసుకోవాలంటే జిల్లాకు ప్రత్యేకంగా డీసీసీ ఉండాల్సిందేననే అభిప్రాయం వినిపిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top