హాస్టల్‌లో పేలిన సిలిండర్

400 మంది విద్యార్థినులకు తప్పిన పెను ప్రమాదం
జగిత్యాలలో ఘటన
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని భవానీనగర్‌లో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో సోమవారం సిలిండర్ పేలింది. దీంతో రేకులషెడ్డు, భవనం కాంపౌండ్‌వాల్ కూలిపోయాయి. కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. ప్రిన్సిపాల్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. వసతి గృహంలో 400 మంది విద్యార్థినులున్నారు. సాయంత్రం వంటమనిషి అనసూర్య వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌కు మంటలు అంటుకోవడంతో అక్కడే ఉన్న ప్రిన్సిపాల్ మాధవికి విషయం చెప్పింది. అప్రమత్తమైన ఆమె విద్యార్థినులను వెంటనే బయటకు వెళ్లాలని సూచించడంతో వారంతా భయంతో పరుగులు పెట్టారు. ఇంతలోనే భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మిగతా సిలిండర్లను తొలగించారు. భయాందోళనతో కన్నీరుమున్నీరవుతున్న విద్యార్థినులను వారు ఓదార్చారు.
బాధ్యులపై చర్యలు: కొప్పుల
ఘటన స్థలాన్ని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం రాత్రి సందర్శించారు. ఘటన జరిగిన తీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి