రాచకొండ @ నేరేడ్‌మెట్‌

Cyberabad Commissionerate Transfer to Neredmet - Sakshi

సైబరాబాద్‌ నుంచి రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ మార్పు

నేరేడ్‌మెట్‌ కేంద్రంగా తాత్కాలిక పాలన

ఆదివారం నుంచి కార్యకలాపాలు ప్రారంభం

మూడు జిల్లాల ప్రజలకు మేలు   ఎల్‌బీనగర్‌లో ప్రజాదర్బార్‌

మేడిపల్లిలో 56 ఎకరాల్లో కొత్త కమిషనరేట్‌!  

సాక్షి, సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్‌ తాత్కాలిక కార్యాలయం నేరేడ్‌మెట్‌ కేంద్రంగా అందుబాటులోకి వచ్చింది. ఆదివారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో ఇటు బాధితులు, అటు పోలీసుల వ్యయ ప్రయాసలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయింది. ప్రభుత్వం 2016 జూన్‌ 23న సైబరాబాద్‌ నుంచి రాచకొండను వేరుచేసి కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేసింది. నాటి నుంచి ఈ కమిషనరేట్‌ కార్యకలాపాలు గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌  నుంచే కొనసాగాయి.

రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి జిల్లాల్లో సుమారు 5091.48 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నందున ఇన్నాళ్లు ఇటు బాధితులు, అటు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి జిల్లా పోలీస్‌ అధికారులైతే ఏదైనా సమావేశం ఉంటే దాదాపు 90 కిలోమీటర్ల ప్రయాణం చేసి సైబరాబాద్‌కు రావాల్సి వచ్చేది. ఇక శివారున ఉన్న ఎల్‌బీనగర్, మల్కాజ్‌గిరి జోన్‌ పోలీసులదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో నేరేడ్‌మెట్‌లో రూ.5.10 కోట్ల వ్యయంతో తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ 28 వేల చదరపు అడుగుల్లో ఆధునాతన సౌకర్యాలతో తాత్కాలిక కమిషనరేట్‌ కార్యాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు తప్పినా.. మేడిపల్లిలో 53 ఎకరాల్లో శాశ్వత కమిషనరేట్‌ కార్యాలయం వస్తే అందరికీ అందుబాటులో ఉంటుందని రాచకొండ పోలీస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

యథాతథంగా ‘ప్రజాదర్బార్‌’  
దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రారంభించిన ‘ప్రజాదర్బార్‌’ యధాతథంగా కొనసాగుతుంది. నేరేడ్‌మెట్‌లో తాత్కాలిక పోలీసు కమిషనరేట్‌ కార్యాలయం అందుబాటులోకి వచ్చినా ప్రజల సౌలభ్యం కోసం నాగోల్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రతి మంగళవారం ప్రజా దర్బార్‌ కొనసాగించాలని కమిషనర్‌ నిర్ణయించారు. మూడు జిల్లాల్లో సుమారు 42 లక్షల జనాభా ఉన్న ఈ కమిషనరేట్‌లో 42 శాంతిభద్రతల ఠాణాలు, రెండు మహిళా పోలీసు స్టేషన్లు, ఆరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు, మూడు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్లు, స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌లు, ఒక సైబర్‌ క్రైమ్‌ సెల్‌ పనిచేస్తున్నాయి. ప్రస్తుత కార్యాలయం రాకతో పాలనా సౌలభ్యంతో పాటు పూర్తిస్థాయిలో నేర నియంత్రణపై చురుకైన నిఘాకు అస్కారం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

సకల సౌకర్యాలతో ఏర్పాట్లు..  
ఆధునిక శైలిలో నిర్మించిన కమిషనరేట్‌ కార్యాలయంలో రిసెప్షన్‌ మర్యాద పూర్వక స్వాగతం పలికేలా హంగులద్దారు. అలాగే విజిటర్స్‌ లాంజ్, మెయిన్‌ అండ్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్, పోలీస్‌ కమిషనర్, జాయింట్‌ కమిషనర్, డీసీపీల చాంబర్లు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్, సీసీఆర్‌బీ హాల్, జాబ్‌ వెరిఫికేషన్‌ హాల్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top