‘ఖని’ పోస్టాఫీస్‌కు కరెంట్‌ కట్‌

current cut for godavarikhani post office - Sakshi

రెండు రోజులుగా నిలిచిన సేవలు

రోజుకు రూ.ల„ý ల్లో నష్టం

మూడేళ్లక్రితమే ముగిసిన అద్దె ఒప్పందం

చోద్యం చూస్తున్న అధికారులు

గోదావరిఖనిటౌన్‌ (రామగుండం) : జిల్లాలోనే అత్యధిక ఆదాయం ఉన్న గోదావరిఖని ప్రధాన పోస్టాఫీస్‌లో రెండు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. కార్యాలయం నిర్వహిస్తున్న భవనం యజమాని రెండు రోజుల క్రితం కరెంట్‌ కట్‌ చేశాడు. అద్దె ఒప్పందం ముగిసి మూడేళ్లు గడిచినా భవనం ఖాళీ చేయకపోవడంతో యజమాని కరెంటు సరఫరా నిలిపేశాడు. దీంతో కార్యాలయంలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన అధికారుల ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడంలేదు.

రామగుండం కార్పొరేషన్‌ పరిధిలోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం లక్ష్మీనగర్‌లోని ప్రధాన పోస్టాఫీస్‌ కార్యాలయం ఉంది. రెండు రోజులుగా ఇందులో సేవలు నిలిచిపోయాయి. 15 ఏళ్లుగా దస్తగిరి కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో నెలకు రూ.11 వేల అద్దెతో ప్రధాన పోస్టాఫీస్‌ నిర్వహిస్తున్నారు. భవనం యజమానికి పోస్టాఫీస్‌ మధ్య ఉన్న అద్దె ఒప్పందం మూడేళ్ల క్రితం ముగిసింది. దీంతో భవనం యజమాని ఫారుక్‌ ప్రత్యామ్నాయం చూసుకోవాలని మూడేళ్లుగా చెబుతూ వస్తున్నాడు. అయితే స్థానికంగా వినియోగదారులకు అందుబాటులో మరో అద్దె భవనం దొరకకపోవడంతో ఖాళీ చేయలేదు. యజమాని సోమవారం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కరెంట్‌ కట్‌ చేశాడు. దీంతో రెండు రోజులుగా ప్రధాన పోస్టాఫీసులో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక వందలాది మంది పోస్టాఫీస్‌కు వచ్చి నిరాశగా వెనుదిరుగుతున్నారు.  

రోజుకు రూ.లక్షల్లో నష్టం...
పోస్టాఫీస్‌ సేవలన్నీ నిలిచిపోవడంతో ప్రభుత్వానికి రోజు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టం వాటిల్లుతోంది. కార్యాలయంలో ముఖ్యమైన సేవలు, డిపాజిట్లు, వడ్డీ స్వీకరణ, స్పీడ్‌ పోస్ట్‌లు, ఇతర 18 రకాల సేవలు స్తంభించాయి. వందలాది మంది నిత్యం నిర్వహించే కార్యకలాపాలు స్పీడ్‌ పోస్ట్, ఉత్తరాల పంపిణీ, రిజిస్టర్‌ పోస్ట్‌లు, రైల్వేటికెట్‌ బుకింగ్, ఆధార్‌ నమోదు, డిపాజిట్లు, వడ్డీ వితరణ, ఆన్‌లైన్‌ పోస్ట్, వెస్ట్రన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ తదితర సేవలకు అంతరాయం కలిగింది.

అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతి..
పోస్టల్‌ నిబంధనల ప్రకారం భవనానికి రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు  అద్దె చెల్లించాలని ఉత్తర్వులు ఉన్నాయి. అయితే ఈ అద్దెకు స్థానికంగా మరొక భవనం దొరకక ఇదే భవనంలో ఉండాల్సి వస్తోందని పోస్ట్‌మాస్టర్‌ ఫజుర్‌ రహమాన్‌ తెలిపారు. రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఉన్న భవనాన్ని రూ.20 వేలలోపు అద్దెకు కేటాయించాలని అధికారులకు విన్నవించామని పేర్కొన్నారు. వారు స్పందించక పోవడంతో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, రామగుండం మేయర్, సింగరేణి జీఎంకు కూడా వినతిపత్రాలు అందించామని వివరించారు. ఎవరూ స్పందించడం లేదని చెప్పారు.

అధిక ఆదాయం ఉన్న పోస్టాఫీస్‌..
జిల్లాలో అత్యధికంగా 10 వేలకు పైగా ఖాతాదారులు ఉన్న పోస్టాఫీస్‌ గోదావరిఖని బ్రాంచ్‌ మాత్రమే. ఇందులో నిత్యం లక్షల్లో లావాదేవీలు జరుగుతాయి. ఈ పోస్టీఫీస్‌లో ప్రస్తుతం సేవలు నిలిపోవడంతో లక్షల రూపాయల నష్టం కలుగుతోంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

నష్టం కలుగకుండా చూడాలి
నిత్యం చాలా రకాల సేవలు పోస్టాఫీస్‌లో జరుగుతాయి. ఆకస్మికంగా విద్యుత్‌ కట్‌ చేసి సేవలు నిలిపి వేస్తే ప్రజలతోపాటు సంస్థ నష్టపోతుంది. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే కరెంట్‌ పునరుద్ధరించి నష్టం కలుగకుండా చూడాలి. పోస్టాఫీస్‌ను కూడా మరో భవనంలోకి మార్చేలా చొరవ తీసుకోవాలి.
– ఫజుర్‌ రహమాన్, పోస్ట్‌మాస్టర్, గోదావరిఖని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top