ఏదీ భరోసా..

CPS Demand Employees Protest In Khammam - Sakshi

ఖమ్మం సహకారనగర్‌: పట్టుదలతో చదివారు.. సర్కారు కొలువులు సాధించారు. ఇక బంగారు భవిష్యత్‌ ఉందనుకున్నారు. సర్వీసు పూర్తయి.. ఉద్యోగ విరమణ తర్వాత జీవితానికి ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయినా.. ఆ కుటుంబానికి ఆర్థిక తోడ్పాటు, ప్రత్యేక ప్రయోజనాలు, సామాజిక భద్రతగా పెన్షన్‌ వస్తుందనుకున్నారు. కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం పరిస్థితి మారింది. దశాబ్ద కాలంగా అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) ద్వారా ఉద్యోగులకు భవిష్యత్తుపై భరోసా కరువవుతోంది. వారిని ఆందోళనలు, పోరాటాల బాట పట్టేలా చేసింది. శనివారం జిల్లావ్యాప్తంగా సీపీఎస్‌ ఉద్యోగులు టీటీజేఏసీ, రెవెన్యూ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.  
ప్రకటన ఇలా..  
సీపీఎస్‌ విధానంపై 2003, డిసెంబర్‌ 22న కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. 2004, జనవరి 1 నుంచి సీపీఎస్‌ను అమలులోకి తెచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2004, సెప్టెంబర్‌ 1 నుంచి సర్వీసులో చేరిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, విశ్వవిద్యాలయ గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ పొందుతున్న సంస్థల్లోని ఉద్యోగులు, అటానమస్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఉద్యోగులందరికీ జీఓ నం.653, 654, 655 కింద 2004, నవంబర్‌ 22 నుంచి అమలు చేస్తోంది. దీనిని పెన్షన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి, ప్రాధికార సంస్థ(పీఎఫ్‌ఆర్‌డీఏ), నేషనల్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌డీఎల్‌) అనే ప్రైవేటు సంస్థల సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.
 
సీపీఎస్‌ విధానంలో రకాలు..  
సీపీఎస్‌ విధానంలో టైర్‌–1, టైర్‌–2 అనే రెండు రకాల ఖాతాలున్నాయి. ప్రస్తుతం ఉద్యోగ, ఉపాధ్యాయులకు టైర్‌–1 ఖాతాను మాత్రమే అమలు చేస్తున్నారు. టైర్‌–2లో ఎప్పుడైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. తన పొదుపును తనకు నచ్చిన సంస్థల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. కానీ.. ప్రస్తుతం టైర్‌–2ను అమలు చేయడం లేదు.

టైర్‌–1 కింద ఉద్యోగ విరమణ చేస్తే.. 
ఉద్యోగి చందాకు సమానంగా ప్రభుత్వం తన వాటాను జమ చేయగా.. వచ్చిన మొత్తంలో ఉద్యోగ విరమణ చేశాక 60 శాతం మాత్రమే అతడికి చెల్లిస్తారు. అందులోనూ 30 శాతానికిపైగా వివిధ రకాల పన్నులు, చార్జీల రూపేణా మినహాయించుకుంటారు. మిగిలిన 40శాతం యాన్యూటీ పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ బాండ్ల నుంచి వచ్చే డబ్బును ఉద్యోగి, అతడి కుటుంబ సభ్యులకు ఉద్యోగ విరమణ తర్వాత నెలనెలా పెన్షన్‌గా 70 ఏళ్ల వరకు చెల్లిస్తారు. ఆ తర్వాత మిగిలిన డబ్బు మొత్తం(ఆదాయపు పన్ను మినహాయించుకొని) ఇస్తారు.

సీపీఎస్‌లోని లోపాలివే..  
 30 నుంచి 35 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసి.. రిటైర్మెంట్‌ అయితే ఆసరాగా ఉండాల్సిన పెన్షన్‌ ఎంత వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి.  ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే సీపీఎస్‌ అకౌంట్‌లో జమ అయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కష్టం.  ఫండ్‌ మేనేజర్స్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు చందాదారులకు లేకపోవడం. ఉద్యోగి తన సర్వీస్‌ కాలంలో 25 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అది కూడా పదేళ్ల సర్వీస్‌ పూర్తయి ఉండాలి. ఉద్యోగ కాలంలో మూడుసార్లకు మించి అవకాశం లేదు. ప్రతి రెండు విత్‌డ్రాల మధ్య మూడేళ్ల విరామం పాటించాలి. విత్‌డ్రాలు కూడా ప్రత్యేక అవసరాలకు మాత్రమే. ఉదాహరణ ఇలా.. ప్రస్తుతం డీఎస్సీ–2008 ఉద్యోగుల మూలవేతనం రూ.26వేలు ఉంటే.. రిటైర్మెంట్‌ నాటికి మూల వేతనం రూ.80వేలు అనుకుంటే.. పాత పెన్షన్‌ లెక్కల్లో నెలకు మూల వేతనం రూ.40వేల పెన్షన్‌ వస్తుంది. కానీ.. నూతన పెన్షన్‌ విధానంలో ఎంత పెన్షన్‌ వస్తుందో చెప్పలేని పరిస్థితి.
 
సీపీఎస్‌ అంశం రాష్ట్ర పరిధిలోనిదే.. 
సీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయిలో పెద్ద ఉద్యమమే మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం అయినందున దీనిని రద్దు చేయలేమని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లును కొన్ని రాష్ట్రాలు ఆమోదించిన తర్వాతే కేంద్రం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం త్రిపుర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్‌ విధానమే అమల్లో ఉంది. సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరినప్పుడు.. ఇది కేవలం రాష్ట్రాల పరిధిలోని అంశం మాత్రమే అని కేంద్రం స్పష్టం చేసినట్లు పలువురు ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. సీపీఎస్‌ విధానం రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి సుమారు రూ.3వేల కోట్లు వస్తాయని, నెలనెలా చెల్లించే రూ.300కోట్లు మిగులుతాయని, 1.27 లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కలిపి దాదాపు 4లక్షల మంది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా నిలుస్తారని చెబుతున్నారు. 
ఉద్యోగుల పోరుబాట.. 
సీపీఎస్‌ రద్దు కోరుతూ తెలంగాణ టీచర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పలు టీచర్ల సంఘా లు ఐక్య ఉద్యమాలు చేస్తున్నాయి. దీంతోపాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని ఏర్పాటైన రాష్ట్ర సీపీ ఎస్‌ ఉద్యోగుల సంఘం మూడేళ్లుగా ఆందోళనలు చేస్తోంది. కాగా.. జిల్లాలో 6వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. 

రద్దు చేసే వరకూ ఆందోళనలు.. 
సీపీఎస్‌ రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించే వరకు ఆందోళనలు కొనసాగిస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది ఉద్యోగ విరమణ పొందారు. 260 మంది వరకు చనిపోయారు. సీపీఎస్‌ అంశం తమ పరిధిలోనిది కాదనేది అవాస్తవం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.  – చంద్రకంటి శశిధర్, జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌ సీపీఎస్‌ ఈయూ 

కేంద్రం జోక్యం అవసరం లేదు.. 
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి.. పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి. దీనికి కేంద్రం జోక్యం అవసరం లేదు. ఇతర రాష్ట్రాల్లో పాత పెన్షన్‌ విధానం అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం పరిధిలోనిదిగా చెబుతూ.. దాటవేస్తోంది. దీంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  – దేవరకొండ సైదులు, యూటీఎఫ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top