కోవిడ్‌ : కొత్త జంట పరార్‌, పట్టుకున్న అధికారులు

Couple deboarded from Delhi Bengaluru Rajdhani Express  - Sakshi

సికింద్రాబాద్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఎక్కిన కొత్త జంట

చేతిముద్ర ద్వారా గుర్తించిన సహ ప్రయాణికులు

కాజీపేటలో దింపేసిన అధికారులు

సాక్షి, కాజీపేట: కరోనా వైరస్‌ మహమ్మారి ఒకవైపువిజృంభిస్తోంటే.. మరోవైపు బాధ్యతగా ఉండాల్సిన పౌరులు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఇద్దరు కరోనా అనుమానితులను గుర్తించారు. స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా వైద్యులు చేతికి వేసిన స్టాంప్‌ (క్వారంటైన్‌ మార్క్‌) ను కూడా లెక్క చేయకుండా ఓ కొత్త జంట పలువురి రైల్వే ప్రయాణీకుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టిన వైనం కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో వెలుగులోకి వచ్చింది. తోటి ప్రయాణికులు అప్రమత్తంగా కావడంతో అలర్ట్‌ అయిన అధికారులు ఆ జంటను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట ఈ ఉదయం సికింద్రాబాద్ స్టేషన్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కారు. రైలు ఉదయం 9.45 గంటలకు కాజీపేట స్టేషన్‌కు చేరుకుంది. చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ ఉపయోగిస్తుండగా, సహ ప్రయాణికులు చేతిపై ఉన్న ముద్రను గమనించి టీటీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాజీపేటలో రైలు ఆపి వైద్యులతో సహా ప్లాట్‌ఫాంపైకి వచ్చి వారిద్దరినీ అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా వారు ప్రయాణిస్తున్న బీ-3 కోచ్‌లోని ప్రయాణికులను మరో బోగీలోకి పంపించారు. అలాగే బీ-3 కోచ్‌ ను శానిటైజ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 5 వరకు ఎక్కడికి వెళ్లొద్దని వికారాబాద్‌ వైద్యులు హెచ్చరించినా వైద్యుల మాట వినకుండా వీరి ఢిల్లీకి బయలుదేరారని తెలిపారు. కాగా శనివారం నాటికి  దేశంలో  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) పాజిటివ్‌ కేసుల సంఖ్య 271 కి చేరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top