ఈడబ్ల్యూఎస్‌ మెడికల్‌ సీట్లకు కౌన్సెలింగ్‌

Counseling for EWS Medical Seats - Sakshi

మూడో విడత కౌన్సెలింగ్‌తో పాటు నిర్వహించాలని నిర్ణయం 

కేవలం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 190 సీట్ల భర్తీకే పరిమితం 

ప్రైవేటులో ఈడబ్ల్యూఎస్‌కు ఎంసీఐ నిరాకరణతో పుంజుకున్న వేగం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో అగ్రవర్ణ పేదలకు కేటాయించిన సీట్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నిర్ణయించింది. మూడో విడత కన్వీనర్‌ కోటా సీట్లతోపాటే వీటికి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇన్నాళ్లుగా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడిందని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వాస్తవంగా ప్రభుత్వంలోని సీట్లు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లకు మొదటి విడత కౌన్సెలింగ్‌తోపాటే అగ్రవర్ణ పేదల (ఈడబ్ల్యూఎస్‌)కు రిజర్వేషన్‌ అమలుచేయాల్సి ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా జరిగాయి.

అప్పటికే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) 190 సీట్లు అదనంగా కేటాయించింది. అంతలోనే ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్లకు కూడా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని, ఆ మేరకు సంబంధిత కాలేజీలు అదనపు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంసీఐ ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో 10 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఈడబ్ల్యూఎస్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కాలం గడుస్తున్నా ప్రైవేటు కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లపై ఎంసీఐ స్పష్టత ఇవ్వలేదు. అయితే అప్పటికే వైద్య విద్య ప్రవేశాల గడువు ఆలస్యమైంది. అందువల్ల ప్రభుత్వంలోని ఈడబ్ల్యూఎస్‌ సీట్లను కూడా పక్కనపెట్టి, మిగిలిన కన్వీనర్‌ కోటా సీట్లకు ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టింది.

ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయింది. ఇప్పుడు ప్రైవేటు మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ నడుస్తోంది. ఇంత జరిగినా ఎంసీఐ నుంచి ప్రైవేటు మెడికల్‌ సీట్లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలు, సీట్ల కేటాయింపుపై స్పష్టత రాలేదు. వస్తాయన్న నమ్మకం లేకపోయినా ఎందుకైనా మంచిదని ఆరోగ్య విశ్వవిద్యాలయం ఇప్పటివరకు వేచిచూసింది. అయితే తాజాగా శుక్రవారం శాసనమండలిలో సభ్యులు ఈడబ్ల్యూఎస్‌ కోటాపై ప్రశ్న సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుకు ఎంసీఐ అదనపు సీట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని 190 సీట్లకు మూడో విడత కన్వీనర్‌ కోటా సీట్లతో కలిపి కౌన్సిలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. ఆగస్టు మొదటి వారంలో వీటికి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top