కమలంలో కలకలం

Corporator Elections Tickets Frauding In Nizamabad - Sakshi

మున్సిపల్‌ టికెట్ల పేరిట వసూళ్లు!

బీజేపీ నగర కమిటీ సమావేశంలో ఫిర్యాదులు

మోసపోవద్దంటూ జిల్లా అధ్యక్షుడి ప్రకటన

‘‘కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో టికెట్లిప్పిస్తామని.. పదవులిప్పిస్తామని కొందరు డబ్బులు తీసుకుంటున్నట్లు జిల్లా పార్టీకి ఫిర్యాదు వచ్చింది.. అలాంటి వ్యక్తులు మీ వద్దకు వస్తే జిల్లా పార్టీకి ఫిర్యాదు చేయండి.. అలాంటి నాయకులను దూరం పెట్టండి.. ఏ ఒక్క కార్యకర్త, పరివార్‌ కార్యకర్తలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.. అలాంటి వ్యక్తులను మందలించాలని విజ్ఞప్తి చేస్తున్నా..’’  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి మంగళవారం చేసిన బహిరంగ ప్రకటన పార్టీ వర్గాల్లో కలకలం సృష్టించింది. 

సాక్షి, నిజామాబాద్‌: కమల దళంలో వసూళ్ల దందా కలకలం రేపింది! బల్దియా ఎన్నికల నగారా మోగక ముందే బీజేపీలో టికెట్ల లొల్లి రచ్చకెక్కుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న ఆ పార్టీలో కార్పొరేటరు, కౌన్సిలర్ల టిక్కెట్లు ఇప్పిస్తామని కొందరు నాయకులు వసూళ్ల దందాకు తెరలేపడం విమర్శలకు దారి తీస్తోంది. మంగళవారం బీజేపీ నిజామాబాద్‌ నగర కమిటీ సమావేశంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడం తో పార్టీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తమకు రాష్ట్ర స్థాయి నాయకులతో పరిచయాలున్నాయని, జాతీయ స్థాయి నేతలు కూడా తెలు సని చెప్పి ఓ నాయకుడు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ద్వితీయశ్రేణి నాయకులు, ఆశావహు లు సమావేశంలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆ పార్టీ ఆశావ హుల సంఖ్య పెరుగుతోంది. ఆశావహుల ఉత్సాహాన్ని కొందరు నేతలు క్యాష్‌ చేసుకునే ప్రయత్నాలు చేస్తుండటం కలకలం సృష్టించింది. 

బీజేపీలో కార్పొరేటర్‌ టికెట్లు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా బహిరంగ ప్రకటన చేయడంతో ఆ వసూల్‌ రాజా ఎవరనే చర్చ పార్టీ వర్గాల్లో ప్రారంభమైంది. కేవలం నిజామాబాద్‌ కార్పొరేషన్‌లోనే ఈ వ్యవహారం కొనసాగిందా.. మిగిలిన మున్సిపా లిటీల్లోనూ ఇలాంటి దందాలేమైనా సాగుతున్నా యా? అనే అంశంపై పార్టీ అప్రమత్తమైంది. ఇలాంటి వ్యవహారాలు ఒక్క నిజామాబాద్‌ కార్పొరేషన్‌లోనే కాకుండా మిగిలిన మున్సిపాలిటీల్లోనూ కొనసాగే అవకాశాలుండటంతో ఆ పార్టీ ముందస్తుగా స్పష్టత ఇచ్చినట్లయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయమై బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డిని ‘సాక్షి’ ఫోన్‌లో సంప్రదించగా ఫిర్యాదులు అందిన మాట వాస్తవమేనని, అమాయక కార్యకర్తలు, నాయకులు నష్టపోవద్దనే ఉద్దేశంతోనే ముందస్తుగా అప్రమత్తం చేశామన్నారు. దీనిపై పార్టీలో అంతర్గత విచారణ ఏమీ జరగడం లేదని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top