తెలంగాణలో ఒక్కరోజే 6 పాజిటివ్‌ కేసులు: ఈటల

Coronavirus Outbreak In Telangana 30 Positive Cases Reported - Sakshi

33కు చేరిన కరోనా బాధితుల సంఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి రాష్ట్రంలో అంతకంతకూ పెరుగుతోంది. తెలంగాణలో సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే, బాధితులు కోలుకుంటున్నారని, అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్‌ కారణంగా మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కోవిడ్‌-19ను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని అన్నారు.
(చదవండి: లాక్‌డౌన్‌ : రోడ్లపైకి జనం.. కలెక్టర్‌ ఆగ్రహం)

కరోనా పోరులో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సైతం కదిలి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. డాక్టర్లు, నర్సింగ్‌ స్టాఫ్‌తో సహా ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అందరికీ తగిన రవాణా సదుపాయాలు కల్పిస్తామని మంత్రి చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాన్నారు. నిత్యావసర దుకాణాలు మినహా అన్నీ బంద్‌ ఉంటాయని వెల్లడించారు.

ప్రజల కోసమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని చెప్పారు. ఆదేశాలను పట్టించుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు గుంపులు గుంపులుగా తిరగొద్దని సూచించారు.  విదేశాల నుంచి వచ్చిన వారు 14 రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని తెలిపారు. పరిస్థితులు అనూహ్యంగా మారితే కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 250 నుంచి 300 వెంటిలేటర్‌ సౌక్యం ఉన్న బెడ్లు, 1000 వరకు ఐసోలేషన్‌ బెడ్ల సదుపాయాన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కల్పిస్తాయని ఈటల పేర్కొన్నారు.
(చదవండి: ఆదేశాలు ఉల్లంఘిస్తే ఆరు నెలలు జైలు..)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top